న్యూఢిల్లీ: వచ్చే నెల (జూలై) 5వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఉద్యోగాల కల్పన దిశగా ఉండాలని వివిధ రంగాల వారు కోరుతున్నారు. నిరుద్యోగం పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగ కల్పన దిశగా బడ్జెట్ ఉండాలని కోరుతున్నారు. అలాగే, ఆదాయపన్ను రేట్స్ తగ్గించాలని వేతనజీవులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉద్యోగాల సృష్టిపై దృష్టి
పై రెండు విజ్ఞప్తులు కూడా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద సవాలే. వృద్ధి మందగించిన వివిధ రంగాలను ముందుకు తీసుకువెళ్లే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే, రూరల్ ఎంప్లాయిమెంట్‌ను పెంచేందుకు స్కిల్ ఇండియా వంటి ప్రోగ్రామ్‌లపై మరింత దృష్టి సారించాలని చెబుతున్నారు. అలాగే, మేకిన్ ఇండియా వంటి ద్వారా మానుఫ్యాక్చరింగ్‌ను మరింత ప్రోత్సహించాలని, ఇది ఉద్యోగాలను సృష్టించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధి పునరుద్ధరించబడాలంటే ఏడాదికి 80 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాలని వరల్డ్ బ్యాంక్ నివేదిక చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇన్‌కం ట్యాక్స్ హేతుబద్దీకరణ
ఇన్‌కం ట్యాక్స్ రేట్స్‌ను హేతుబద్దీకరించాలని వేతనజీవులు కోరుతున్నారు. ఆర్థిక వృద్ధికి ఇది కూడా అవసరమని చెబుతున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నులు పెంచక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను హేతుబద్దీకరణ అనేది ప్రభుత్వానికి కత్తిమీద సామే. అయితే ప్రజలకు ఊరటనిచ్చేలా ఇన్‌కమ్ ట్యాక్స్‌లో కొన్ని మార్పులు చేస్తే ప్రభుత్వ ఆదాయంపై అంత ప్రభావం ఉండదనేది ఆర్థికవేత్తలు అభిప్రాయం.

జీఎస్టీ, చదువు...
ప్రజల నుంచి మరో విజ్ఞప్తి కూడా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వెళ్తోంది. ఇళ్లు కొనుగోలు చేసేవారికి బెనిఫిట్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) రేట్ల హేతుబద్దీకరణ, చదువుకు అవుతున్న అధిక ఖర్చు, వ్యాపారాల్లో ఎదురవుతున్న సవాళ్ల తొలగింపు వంటి అంశాలపై కేంద్రమంత్రి దృష్టి సారించాలని చెబుతున్నారు.

రూ.5 లక్షల ట్యాక్స్ మినహాయింపుపై...
ఇదిలా ఉండగా, అదాయపన్ను మినహాయింపుపై మోడీ ప్రభుత్వం ఎన్నికలకు ముందే గుడ్ న్యూస్ తెలిపింది. రూ.5 లక్షల ఆదాయంపై మినహాయింపు ఉంటుందని చెప్పింది. ఏడాదికి రూ.5 లక్షలు ఆదాయంపై గత బడ్జెట్‌లో సెక్షన్ 87 కింద పూర్తి ట్యాక్స్ రిబెట్‌ను కల్పించింది. కాబట్టి ఈ బడ్జెట్‌లో ఎలాంటి మినహాయింపులు ఉండవని చెబుతున్నారు. అయితే జీరో పన్ను కిందకు వచ్చినప్పటికీ వారు తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఒకవేళ రూ.5 లక్షల ఆదాయం కలిగిన వారికి మినహాయింపు ఇవ్వాలంటే మధ్యంతర బడ్జెట్‌కు అర్థం ఉండదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పరిమితి పెంచడం వల్ల చాలామంది ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓ వైపు ట్యాక్స్ పేయర్స్ బేస్ పెంచాలని మోడీ ప్రభుత్వం అనుకుంటోంది. అయితే ఇలాంటి మినహాయింపులు సరికాదని అభిప్రాయపడుతున్నారు.

పన్ను వసూళ్లపై సూచనలు
పన్ను వసూళ్లపై పలువురు సూచనలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ శ్లాబ్స్‌ను తొలగించి, 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 20 శాతం పన్ను నుంచి 10 శాతానికి సవరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 క్షల ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 20 శాతానికి, అలాగే, రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉంటే దానిపై 30 శాతం పన్ను ఉండేలా చూడాలని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications