న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 5వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పలువురితో సమావేశమవుతున్నారు. అదే సమయంలో ఆమెకు పలు వినతులు కూడా వస్తున్నాయి. డిఫాల్టర్ల ఆస్తులు అమ్మాలని బ్యాంకు యూనియన్లు సూచిస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీని ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (AIBEA) కోరింది. రిటైల్ ఇన్వెస్టర్లకు రాయితీలు పెంచాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.

ఆదాయపన్ను 7.5 లక్షలకు పెంచాలి
ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీని ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం (AIBEA) కోరింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. అందరికీ బ్యాంకింగ్ హక్కుగా మారాలని, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేటును కనీసం 2 బేసిక్ పాయింట్లు పెంచాలని కోరారు. వ్యవసాయ రుణాలను ఏడాదికి 2 శాతం చొప్పున బ్యాంకులు పెంచుకుంటూ పోవాలన్నారు. ప్రయివేటు బ్యాంకులను ప్రభుత్వరంగం కిందకు తీసుకు రావాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 100 శాతం ఈక్విటీ ప్రభుత్వం పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి ఉపసంహరణలు ఉండవద్దన్నారు. బ్యాంకు ఎగవేతలు ఉద్దేశ్యపూర్వకమైతే క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యోగుల ఆదాయపన్ను పరిమితి రూ.7.5 లక్షలకు పెంచాలన్నారు.

ఆదాయపన్ను ఇలా ఉండాలి..
ఆదాయపన్ను పరిమితిపై AIBEA జనరల్ సెక్రటరీ వెంకటాచలం సూచనలు చేశారు. రూ.7.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు 25 శాతం పన్ను ఉండాలని సూచించారు. ధనికులకు అదే క్రమపద్ధతిలో ఆదాయపన్ను పెరగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డిఫాల్టర్ల ఆస్తులు అమ్మేయాలి
డిఫాల్టర్ల కారణంగా బ్యాంకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ చట్టాలు, నిబంధనలు కఠినతరం చేయాలని బ్యాంక్ యూనియన్లు అభిప్రాయపడుతున్నాయి. రుణ బకాయీల వసూళ్లకు మరింత ప్రభావవంత చట్టాలు తేవాలని, డిఫాల్టర్ల సంస్థల డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులు జఫ్తు చేసేలా నిబంధనలు సవరించాలని AIBEA కోరింది. మరిన్ని ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది.

NBFC సహా మరిన్ని సూచనలు
NBFCల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పరిశ్రమ ప్రతినిధులు కోరారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మూలధనం అవసరమన్నారు. NBFC రంగంలో ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్‌మెంట్ కౌన్సెల్ క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. NBFCలో నగదు లభ్యతకు ప్రత్యేక విభాగం అవసరమన్నారు. వ్యవసాయ మార్కెట్‌కు ప్రోత్సాహకాలు కావాలన్నారు. MSME రంగంలో బిజినెస్ లైసెన్స్ ఆన్‌లైన్ ద్వారా తీసుకునే సదుపాయం కావాలన్నారు. దివాలా చట్టం వల్ల ఎదురవుతున్న నగదు లభ్యత ఇబ్బందులు తొలగేలా చూడాలన్నారు. జీఎస్టీ విధానాన్ని సరళీకరించాలని కోరారు. ఇన్సురెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని ఫిక్కీ కోరింది. రీఇన్సురెన్స్ రంగంలో 49 శాతానికి పరిమితం చేయవచ్చునన్నారు. ఎగుమతులకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని, నగదు కొరతను తీర్చాలని భారతీయ వాణిజ్య ప్రోత్సాహక మండలి నిర్మలా సీతారామన్‌ను కోరింది.


Click it and Unblock the Notifications