పవన్ కళ్యాణ్ ఓటమికి రూ.150 కోట్ల ఖర్చు, ఏ పార్టీ ఎక్కువ ఖర్చు చేసిందంటే?
గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ఖర్చు చేశారా.. అంటే అవుననే అంటున్నారు జనసైనికులు. మిత్రపక్షాలతో కలిసి 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. స్వయంగా జనసేనాని గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో ఓడిపోయారు. భీమవరంలో తన ఓటమికి రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలిసిందని, తాను శాసన సభలో అడుగు పెట్టకుండా ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పని చేశారని పవన్ తాజాగా వ్యాఖ్యానించారు.

రూ.150 కోట్లు ఖర్చు, అందుకే
తన జీవితం రాజకీయాలకు అంకితమని, తన శవాన్ని నలుగురు మోసుకెళ్లే వరకు జనసేనను మోస్తానని, 25 ఏళ్ల లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. కాగా, పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని ఎన్నికలకు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా ఈ తరహా విమర్శలు గుప్పించింది. భీమవరంలో అయితే రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసిందని పవన్ తాజాగా చెప్పడం గమనార్హం. తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలనే లక్ష్యంతో ఇలా చేశారన్నారు.

ఏపీలో పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ - వైసీపీ మధ్య హోరాహోరీ కనిపించింది. కానీ ఫలితాలు చూస్తే.. వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారని భావించిన పవన్ కళ్యాణ్... పార్టీ ఒక్క సీటు మినహా గెలవలేకపోయింది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష ఓటు చీల్చుతారని భావిస్తే, టీడీపీ అనుకూల ఓట్లను చీలినట్లుగా స్పష్టంగా కనిపించింది. ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీ పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏపీలో పలుచోట్ల ఓటుకు రూ.1,000, రూ.2,000 నుంచి రూ.10,000 వరకు ఇచ్చినట్లుగా కూడా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.

ఓటును అమ్ముకోవద్దని చెప్పినా...
ఓటును అమ్ముకోవద్దని ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఓటును అమ్ముకుంటే ప్రజాస్వామ్య వంచన అని, అది జైలు శిక్ష విధించగల నేరమని కూడా పేర్కొంది. కానీ దాదాపు అన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలోని 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున డబ్బు పంపకం జరిగిందట. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు.. ఈ నాలుగు జిల్లాల్లో సగటున సగం మందికి పైగా ఓటర్లకు డబ్బులు పంపిణి చేశారట. ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.రెండువేలు ఇచ్చారట.

ఒక్కో ఓటుకు రూ.700
ఇక, దేశవ్యాప్తంగా ఒక్కో లోకసభ నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఖర్చు చేశారని, ఏపీలో ఓట్ల కోసం భారీగా డబ్బులు ఖర్చుచేశారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏకంగా రూ.60వేల కోట్లు ఖర్చయినట్లు ఇటీవలే ఈ నివేదిక అంచనా వేసింది. 2014 లోకసభ ఎన్నికల్లో రూ.30వేల కోట్లు ఖర్చు కాగా, ఈసారి అందుకు రెట్టింపు అయినట్లు వెల్లడించింది. ఒక్కో లోకసభ నియోజకవర్గానికి సగటున రూ.100 కోట్లు, ఒక్కో ఓటుకు రూ.700 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా వేసింది.

దేనికి ఎంత ఖర్చు చేశారంటే?
1998 ఎన్నికల్లో రూ.9వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా వేశారు. ఇప్పుడు దాని కంటే దాదాపు ఏడు రెట్లు అధికం ఖర్చు చేశారు. ఇందులో బీజేపీ 45 శాతం, కాంగ్రెస్ 40 శాతం ఖర్చు చేసింది. 1998లో బీజేపీ ఖర్చు చేసింది 20 శాతం. ఖర్చు చేసినా మొత్తంలో.. రూ.12,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు ఓటర్లకు ఇచ్చారు. ఇది 20-25 శాతం. రూ.20,000 నుంచి రూ.25,000 ప్రచారం కోసం ఖర్చు చేశారు. రూ.5,000 నుంచి రూ.6,000 వరకు లాజిస్టిక్స్ పైన, రూ.3,000 నుంచి రూ.6,000 కోట్ల వరకు ఇతర సౌకర్యల కోసం ఖర్చు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఇలాగే ఉంటే 2024 ఎన్నికలకు లక్ష కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications