న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మూడేళ్లలోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. జియో యూజర్లు 30 కోట్లకు పైగా ఉన్నారు. తాజాగా, అది మరో రికార్డ్ సృష్టించింది. భారత్‌లోని మోస్ట్ పాపులర్ బ్రాండ్‌లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మొదటి స్థానంలో నిలిచిందని తాజా సర్వేలో వెల్లడైంది. అంతకుముందు ఏడాది జరిపిన సర్వేలో రిలయన్స్ జియో మూడో స్థానంలో నిలిచింది. అప్పుడు తొలి రెండు స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్ నిలిచాయి. ఈసారి జియో రెండో స్థానానికి ఎగబాకింది.

కోల్పోవడం సులభం.. పట్టు కష్టం
రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. టాప్ టెన్‌లో టెక్నాలజీకి సంబంధించిన సంస్థలే నిలిచాయి. పేటీఎం, శాంసంగ్, అమెజాన్‌లు ఉన్నాయి. ఐపోసిస్ (Ipsos) సర్వేలో ఇది వెల్లడైంది. ఐపోసిస్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా (బిజినెస్ హెడ్, ముంబై) మాట్లాడుతూ... లోకల్ బ్రాండ్స్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం చాలా క్లిష్టమైన విషయమని చెప్పారు. జియో వంటి దేశీయ ప్రోడక్ట్ ఉత్తమ ర్యాంక్ కనబరిచిందని అభిప్రాయపడ్డారు. బ్రాండ్ ముఖ్యమైనప్పటికీ, పట్టు సాధించడం చాలా కష్టమని, కానీ దానిని కోల్పోవడం చాలా సులభమని చెప్పారు. తద్వారా జియో గత ఏడాది మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకడంపై వ్యాఖ్యానించారు.

టాప్ 5లో రెండు దేశీయ బ్రాండ్స్
గూగుల్, రిలయన్స్ జియోలు ఈ సర్వేలో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం (మూడో స్థానం), మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ (నాలుగో స్థానం), జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ (ఐదో స్థానం)లో నిలిచాయి. టాప్ 5లో గ్లోబల్ బ్రాండ్స్‌తో పాటు దేశీయ బ్రాండ్స్ కూడా నిలిచాయి. జియో, పేటీఎంలు దేశీయ బ్రాండ్స్.

జియో-ఎయిర్‌టెల్ నెక్ టు నెక్
అలాగే టాప్ 10లో నాలుగు దేశీయ బ్రాండ్స్ నిలిచాయి. రిలయన్స్ జియో, పేటీఎంలతో పాటు ఎయిర్‌టెల్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాయి. శాంసంగ్ 6వ స్థానంలో, బిల్‌గేట్స్ నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ 7వ స్థానంలో, యాపిల్ ఐఫోన్ 9వ స్థానంలో నిలిచాయి. ఎయిర్‌టెల్ 8వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్ 10వ స్థానంలో ఉన్నాయి. అంతకుముందు, ఇండియాలో భారతీ ఎయిర్‌టెల్ మోస్ట్ పాపులర్ టెలికం కంపెనీగా ఉంది. ఇప్పుడు దానిని రిలయన్స్ దాటేసింది. ప్రస్తుతం రిలయన్స్ జియో - ఎయిర్‌టెల్ సబ్‌స్కైబర్స్ జాబితాలో పోటాపోటీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications