మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ నగదు బదలీపై వసూళ్లుండవ్: NEFT, RTGS ఛార్జీలు ఎత్తివేత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం శుభవార్త చెప్పింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో NEFT (National Electronic Funds Transfer), RTGS (Real Time Gross Settlement System) ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలను తొలగించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీల రద్దుతో ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎంతో ఊరట. ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేయడం ఒకటి. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు దీనిని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

RTGS, NEFT ఛార్జీల ఎత్తివేత
RTGS, NEFT ఆన్‌లైన్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 'డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్‌ను ఉపయోగిస్తే వసూలు చేసే ఛార్జీలను ఎత్తివేస్తున్నాం. బ్యాంకులు దీనిని అమలు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జీలను ఎత్తివేసిన ఫలాలను అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అందించాలి. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బ్యాంకులకు వారం రోజుల్లో పంపిస్తాం' అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది.

ఇటీవలే సమయం పొడిగిస్తూ శుభవార్త
RTGS, NEFT ద్వారా జరిగే ట్రాన్సాక్షన్‌లకు ఆర్బీఐ మినిమం ఛార్జీలను వసూలు చేస్తోంది. ఇంతకుముందు ఆర్టీజీఎస్ సమయాన్ని ఆర్బీఐ గంటన్నర పాటు పొడిగించింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు ఆర్టీజీఎస్ సమయం సాయంత్రం గం.4.30 వరకు ఉంది. ఆర్బీఐ దీనిని సాయంత్రం గం.6.00 వరకు పొడిగించింది. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్‌కు రాత్రి గం.7.45 వరకు పొడిగించింది. ఇప్పటికే సమయాన్ని పెంచి కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తెలిపింది.

నగదు ఛార్జీలపై...
ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ కోసం ఆర్టీజీఎస్, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం ఎన్ఈఎఫ్టీని ఉపయోగిస్తాం. వీటి ద్వారా నగదు బదిలీలు చేసినప్పుడు బ్యాంకులు కొంత ఛార్జీలు వసూలు చేస్తాయి. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు SBI ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. ఈ ట్రాన్సాక్షన్స్ పైన బ్యాంకుల నుంచి ఆర్బీఐ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి.

ఆర్బీఐ
కాగా, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గురువారం వెల్లడించింది. ఇందులో రెపో రేటుపై పావు శాతం కోత విధించింది. ప్రస్తుతం రెపో రేటు 6 శాతంగా ఉంది. ఆర్బీఐ ప్రస్తుత నిర్ణయంతో 5.75శాతానికి తగ్గింది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50 శాతం, 6 శాతానికి సవరించింది.


Click it and Unblock the Notifications