అనిల్ అంబానీ ఇంకేం అమ్మబోతున్నాడు?
ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడమన్న సామెత అనిల్ అంబానీకి అతికినట్లు సరిపోతుంది. ఒకప్పుడు వేల కోట్ల లాభాలార్జించిన అడాగ్ గ్రూప్ ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో అప్పుల భారం తగ్గించుకునేందుకు ఆయన ఒక్కో ఆస్తి తెగ నమ్ముకుంటున్నారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్, అంబానీ రేడియోకు గుడ్ బై చెప్పిన ఆయన తాజాగా రిలయన్స జనరల్ ఇన్స్యూరెన్స్ యూనిట్‌ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా: అప్పుల భారం రూ.50 వేల కోట్లు!

హీరో ఫిన్‌కార్ప్‌తో చర్చలు
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్‌ను హీరో ఫైనాన్స్ కార్పొరేషన్‌కు విక్రయించే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే ఈ విషయాన్ని కంపెనీ ధ్రువీకరించడంలేదు.

రుణభారం తగ్గించుకునేందుకు
గత దశాబ్దకాలంగా అనిల్ అంబానీ వ్యాపారాలు సరిగా సాగడంలేదు. ముఖ్యంగా టెలికం బిజినెస్‌లో తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి రావడంతో మిగతా వ్యాపారాలపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఏటికేడు అప్పులు పెరుగుతూ పోతున్నాయి. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ రుణభారాన్ని వీలైనంత తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే మ్యూచవల్ ఫండ్స్ బిజినెస్‌కు గుడ్ బై చెప్పిన ఆయన.. రేడియో స్టేషన్ అమ్మకానికి సంబంధించి ఒప్పందం పూర్తి చేసుకున్నారు.

రూ.6000 కోట్ల విలువ
రిలయన్స్ జనరల్ ఇన్స్యూరెన్స్ విలువ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే హీరోతో చర్చలకు సంబంధించి స్పందించేందుకు రిలయన్స్ క్యాపిటల్ నిరాకరించింది. హీరో మోటో కార్పొరేషన్ సైతం ఈ అంశంపై స్పందించలేదు. ఈ నెల ప్రారంభంలో కేర్ రేటింగ్ సంస్థ క్రెడిట్ స్కోర్ తగ్గించడంపై రిలయన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆస్తుల అమ్మకం ద్వారా రూ.10వేల కోట్ల నిధులు సమకూర్చుకుని సగానికి పైగా అప్పులు తగ్గించుకోనున్నామన్న విషయాన్ని రేటింగ్ సంస్థ పరిగణలోకి తీసుకోలేదని చెప్పింది.


Click it and Unblock the Notifications