పెరిగిన పాల ధరలు.. లీటర్‌కు రూ.2 పెంపు
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాల ధరలు పెరిగాయి. లీటర్‌కు రూ.2 పెంచుతూ ప్రయివేటు డెయిరీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలను ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినియోగదారులపై సుమారు రూ.700 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది.
ప్రముఖ ప్రయివేటు డెయిరీ కంపెనీలైన హెరిటేజ్, జెర్సీ, దొడ్ల, వైష్ణవి, ఎంఎన్ఆర్, గాయత్రి, ఆరోక్య, తిరుమల డెయిరీలు కొత్త ఎంఆర్పీలతో పాలను విక్రయిస్తుండగా, సహకార డెయిరీ కంపెనీలు త్వరలో పెంచే అవకాశాలు ఉన్నట్లు డెయిరీ రంగ విశ్లేషకులు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో రోజుకు దాదాపు 25 లక్షల లీటర్ల పాల విక్రయాలు జరుగుతుంటాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పాల వినియోగం రోజుకు కోటి లీటర్లకు పైగా ఉంటుంది. అయితే పెరిగిన ధరలతో వినియోగదారులు కొంతకాలం ఇబ్బంది తప్పకపోవచ్చు.

పెంపు అనంతరం లీటర్ పాల ధర రూ.44, అర లీటర్ పాల ధర రూ.22కు లభిస్తోంది. తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కరువు తరహా పరిస్థితులు నెలకొనడంతో పశువులకు దాణా ఇబ్బంది కలుగుతోందని, పాడి ఉత్పత్తి కూడా 10-12 శాతం తగ్గిందని, డెయిరీ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే, గత రెండు మూడేళ్లుగ పాల ధరలు స్థిరంగా ఉన్నాయని, ముడి పదార్థాలు, పాల సేకరణ వ్యయాలు పెరగడంతో ఆ ప్రభావాన్ని వినియోగదారుడిపై మోపాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.
అయితే పాలతో మొదలైన ధరల పెరుగుదల ఇతర పాల పదార్థాలైన పెరుగు, పన్నీరు, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్, బటర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లోకి ఉత్తరాది సహకార పాల సంస్థ అమూల్ రంగ ప్రవేశంతో మొత్తంగా కొన్నేళ్లు పాల కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడి, ధరలను తగ్గించారు. కానీ కొంతకాలానికి లీడర్‌కు రూ.42 వద్ద స్థిరపడ్డాయి. కానీ ఇకపై లీటర్‌కు రూ.44 చెల్లించాల్సిందే. ఒకవేళ మెరుగైన వర్షాలు పడి పాడి ఉత్పత్తి పెరిగినా పాల ధరలు ఇకపై తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications