బ్యాంకింగ్ సేవల్లో కొత్త మార్పునకు శ్రీకారం: ఏడురోజులు... 24 గంటలు NEFTసేవలు..?
బ్యాంకింగ్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. పెరిగిపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా మార్పులు వస్తున్నాయి. దీంతో ఇటు కస్టమర్లకు అటు బ్యాంక్ సిబ్బందికి పనిభారం కూడా తగ్గుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ప్రతిపాదన తీసుకొచ్చింది.

ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించింది. పెరుగుతున్న టెక్నాలజీతో ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోన్న బ్యాంకింగ్ వ్యవస్థలో 24 గంటల పాటు నగదు బదిలీ చేసుకునే వీలు కస్టమర్లకు కల్పించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పరిమిత సమయం వరకే ఉన్న నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(NEFT) ఆప్షన్‌ను వారంలోని ఏడు రోజుల పాటు 24 గంటలు అందుబాటులో ఉంచాలనే ప్రతిపాదనను 2019-21 సంవత్సరానికి తయారు చేసిన విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చింది. దీంతో పాటుగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్స్ (RTGS) లావాదేవీల సమయం కూడా పెంచాలని భావిస్తోంది.

ప్రస్తుతం NEFT సేవలు ఇలా ఉన్నాయి
ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతి ప్రకారం ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసుకునే అవకాశం ఉంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రోజుకు ఒక్క రూపాయి నుంచి రూ.25 లక్షల వరకు నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. ఇక రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ పద్ధతి ద్వారా రోజుకు రూ. 2లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు నెట్ బ్యాంకింగ్ వినియోగించి నగదు బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు (NEFT,RTGS)ఆదివారం, రెండో శనివారం, నాలుగో శనివారాల్లో అందుబాటులో ఉండవు. బ్యాంకులకు ఆ రోజు సెలవు దినాలు కావడంతో ఈ సేవలు కూడా నిలిపివేయడం జరుగుతోంది.

NEFT సేవల సమయాలు ఇలా ఉన్నాయి
ఇక బ్యాంకు పనిదినాల్లో NEFT ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అదే రెండో శనివారం మూడో శనివారాల్లో అయితే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎన్‌ఈఎఫ్‌టీ సేవలు సాధారణ రోజుల్లో సాయంత్రం ఏడు గంటల తర్వాత అందుబాటులో ఉండకపోవడం, శనివారాల్లో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత అందుబాటులో లేకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్టీజీఎస్ సేవలైతే ఇంకా తక్కువ సమయానికే క్లోజ్ అవుతున్నాయి. ఈ సేవలు సాయంత్రం 4 గంటల వరకే అందుబాటులో ఉంటున్నాయి.

మరో ఆప్షన్‌గా IMPSసేవలు... బట్ కండీషన్స్ అప్లై
NEFT,RTGS సేవలు అందుబాటులో లేని సమయాల్లో కస్టమర్లకు మరో ఆప్షన్ ఉంది. ఈ రెండు సేవలు పనిచేయని సమయంలో కస్టమర్లు ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీసులను (IMPS)ఆశ్రయించవచ్చు. ఈ సేవలు 24 గంటలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. అయితే రూ.2 లక్షల వరకు మాత్రమే మరో ఖాతాకు నగదు బదిలీ చేసుకునే వీలుంటుంది. అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా NEFTసేవలు 24 గంటలకు మారిస్తే కస్టమర్లు నగదు బదిలీ చేసేందకు మార్గం మరింత సుగుమం అవ్వడమే కాకుండా బ్యాంకు సిబ్బందిపై కూడా పనిభారం తగ్గుతుంది.


Click it and Unblock the Notifications