'5000 మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్లిపోయారు': వచ్చే 10 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూర్లు ఇలా..
2018 సంవత్సరంలో 5,000 మంది మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారట. ఇలా దేశం వదిలి వెళ్లిన మిలియనీర్ల (high net worth individuals-HNWI)లో భారత్ మూడో స్థానంలో ఉంది. మొత్తం HNWIలలో దేశం వదిలి వెళ్లిపోయిన వారు 2 శాతం. ఈ మేరకు ఆఫ్ర్ఆసియా బ్యాంక్-న్యూ వరల్డ్ వెల్త్ సంయుక్తంగా చేసిన గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ (GWMR) సర్వేలో వెల్లడైంది. 2018లో భారత్ నెట్ అవుట్ ఫ్లో (దేశం విడిచి వెళ్లిపోయిన వారు) యూకే కంటే వేగంగా ఉండటం గమనార్హం. బ్రెగ్జిట్ నేపథ్యంలో యూకేలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. కానీ అక్కడి కంటే మన దేశంలోనే అవుట్ ఫ్లో ఎక్కువగా ఉండటం గమనార్హం.

చైనా, రష్యా, తర్వాత మూడో స్థానంలో భారత్
గత మూడు దశాబ్దాలుగా ఇన్‌ఫ్లో (దేశంలోకి వస్తున్నవారు)లో యూకే ముందుంది. కానీ బ్రెగ్జిట్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా రివర్స్ అయింది. ఇక్కడి నుంచి కూడా బయటకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగింది. అవుట్ ఫ్లోలో చైనా మొదటి స్థానంలో ఉంది. గత కొద్ది రోజులుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ సాగుతోంది. దీంతో అవుట్ ఫ్లో మరింత ఎక్కువగా ఉండవచ్చునని అంచన. రష్యా రెండో స్థానంలో ఉంది. వివిధ రకాల నిషేధాలు, ఆంక్షల నేపథ్యంలో రష్యాను వదిలి వెళ్లిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

అమెరికా, ఆస్ట్రేలియాల వైపు చూపు
వివిధ దేశాల నుంచి వెళ్తున్న మిలియనీర్లు అమెరికా, ఆస్ట్రేలియాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ సమతుల్యంగా లేకపోవడం మిలియనీర్లకు ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. భారత్‌లోని కొద్ది మంది మిలియనీర్ల వద్ద దాదాపు సగం దేశ సంపద ఉంది. ప్రపంచవ్యాప్తంగా అవుట్ ఫ్లో యావరేజ్‌గా 36 శాతం ఉంటే, భారత్‌లో 48 శాతం ఉండటం గమనార్హం. రానున్న పదేళ్లలో భారత సంపదలో మంచి వృద్ధి కనిపించనుందని ఈ సర్వేలో వెల్లడైంది. 2028 నాటికి భారత్ యూకే, జర్మనీ తరహాలో లార్జెస్ట్ ఫోర్త్ వెల్త్ మార్కెట్‌గా నిలవనుందని సర్వేలో వెల్లడైంది.

ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కీలకం
రానున్న పదేళ్లలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని ఈ సర్వేలో తేలింది. ఢిల్లీ విభిన్న రకాలుగా ఆర్థిక ప్రగతిలో దూసుకు వెళ్తుందని, కీలకమైన సెక్టార్‌లు పెరుగుతాయని, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఆర్ అండ్ డీలో బెంగళూరు సత్తా చాటుతుందని, హైదరాబాద్ ఫార్మాస్యూటికల్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా నిలుస్తుందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. భారత్, చైనాల నుంచి పెద్ద ఎత్తున మిలియనీర్లు విదేశాలకు వెళ్తున్నారని, అయితే వారు కోల్పోతున్న మిలియనీర్ల కంటే కొత్తగా మరింత మంది పుట్టుకు వస్తున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది. అయితే జీవన ప్రమాణాలు పెరిగితే దేశం వదిలి వెళ్లిన వారు తిరిగి వచ్చే ఆస్కారం ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications