ఫారం 16లో సరికొత్త మార్పులు: ఇన్‌కం, ట్యాక్స్ బ్రేక్స్ ఇక దాచడం కష్టం!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) కొత్త ఫార్మాట్ కలిగిన ఫామ్ 16ను నోటిఫై చేసింది. యాజమాన్యాలు ఉద్యోగుల టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) వివరాలకు సంబంధించి జారీ చేసే ఫామ్ 16 సర్టిఫికేట్ ఫార్మాట్‌ను సవరించింది. హౌస్ ప్రాపర్టీ నుంచి ఆధాయాలు, ఇతర యాజమాన్యాల నుంచి పారితోషికాలు సహా విస్తృత ప్రాతిపదికన సమాచారం అందుబాటులో ఉండేలా ఫామ్ 16ను సవరించింది.

పన్ను ఎగవేతల్ని నిరోధించడమే లక్ష్యంగా సమగ్రంగా ఫారం 16
పన్ను ఎగవేతలను నిరోధించడమే లక్ష్యంగా సమగ్రంగా ఈ ఫార్మాట్‍ను రూపొందించినట్లు చెబుతున్నారు. వివిధ పన్ను పొదుపు పథకాల కింద కోతలు, పన్ను పొదుపు పథకాల్లో పెట్టుబడులు, ఉద్యోగులు అందుకునే వివిధ అలవెన్సెస్‌తో పాటు ఇతర వనరుల ద్వారా ఆదాయం, పొదుపు ఖాతాలో డిపాజిట్లపై వడ్డీలు, రిబేట్స్, సర్‌చార్జీలు ఇలా విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. సీబీడీటీ ఏప్రిల్ 12వ తేదీన నోటిఫై చేసిన ఈ కొత్త ఫామ్16 మే 12వ తేదీ నుంచి అమలులోకి రానుంది. దీని ప్రకారం, ఐటీ రిటర్న్స్ తాజా ఫామ్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. ఆ తేదీ తర్వాత ఫారం 16 ఉపయోగిస్తే కొత్త ఫార్మాట్ ప్రకారం సమర్పించాల్సిందే.

ఐటీ రిటర్న్స్
సంస్థల్లోని ఉద్యోగుల వేతనంలో మూలం వద్దే ముందస్తుగా వసూలు చేసే పన్ను టీడీఎస్. దీనికి సంబంధించి యాజమాన్యాలు ఇచ్చే ఫారం 16లో ఐటీ (ఆదాయపన్ను శాఖ) కొత్త మార్పులు చేసింది. ఇంటిపై వచ్చే ఆదాయం, ఇతర యాజమాన్యాల నుంచి వచ్చే ప్రతిఫలం వంటివీ జతచేయాలి. వేర్వేరు ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ వల్ల మినహాయింపు, వాటిలో పెట్టుబడుల వివరాలు, పొందిన భత్యాలు, ఇతర మార్గాల నుంచి లభించే ఆదాయాన్ని కూడా వీటిలో పొందుపర్చాల్సి ఉంటుంది. ఫారం 16 సాధారణంగా జూన్ మధ్యలో ఇస్తారు. ఐటీ రిటర్న్స్ సమర్పించేందుకు వీటిని వినియోగిస్తారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్న్స్ సవరించిన ఫార్మ్ 16 ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది.

జూలై 31 లోపు దాఖలు చేయాలి
సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ తీసివేత వివరాలు కూడా నమోదు చేయాలి. రిబేట్, సర్‌ఛార్జీ వంటి వాటిని పొందుపరచాలి. వేతనాలు పొందే ఉద్యోగులు, తమ ఖాతాలు ఆడిట్ చేయాల్సిన అవసరం లేనివారు, ఐటీ రిటర్న్స్‌ను జులై 31లోపు దాఖలు చేయాలి. స్టాండర్డ్ డిడక్షన్‌తో పాటు సెక్షన్ 10 కింద మినహాయింపుల క్లెయిమ్‌లను పొందుపరచాలి. సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80ఈ, 80జీ కింద తీసివేతలను వేర్వేరుగా నమోదు చేయాలి. అలాగే, యాజమాన్యాలు ఏటీ విభాగానికి సమర్పించే ఫారం 24క్యూను కూడా సవరించారు. ఉద్యోగి కనుక ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలుకు సంస్థాగతం కానీ సంస్థల నుంచి రుణం తీసుకుంటే వాటి పాన్ నెంబర్ నమోదు చేయాలి.


Click it and Unblock the Notifications