7 నగరాల్లో విపరీతంగా పెరిగిన హౌసింగ్ సేల్స్, కారణమిదే: ఇళ్లు హైదరాబాద్‌లోనే చౌక!
కేంద్ర ప్రభుత్వం ఇళ్లపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2019 తొలి క్వార్టర్‌లో హౌసింగ్ సేల్స్ 58 శాతం పెరిగాయట. 78,520 యూనిట్ అమ్మకాలు జరిగాయట. ఈ మేరకు ప్రాపర్టీ కన్సల్టెంట్ అన్‌రాక్ వెల్లడించింది. 2018 చివరి క్వార్టర్ కంటే 2019 మొదటి క్వార్టర్‌లో అమ్మకాలు 12 శాతం పెరిగాయట. 2018లో జనవరి నుంచి మార్చి వరకు 49,800 యూనిట్స్ సేల్స్ ఉన్నాయి. 2019లో మాత్రం 78 వేలకు పైగా ఉన్నాయి.
నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఇవి పెరిగాయి. అన్‌రాక్ డేటా ప్రకారం.. ఎంఎంఆర్ (ముంబై)లో 95 శాతం సేల్స్ పెరిగాయి. 2018 జనవరి - మార్చి మధ్య 12,300 యూనిట్స్ సేల్ ఉంటే ఈ ఏడాది ఇదే సమయంలో 24,010 గా ఉంది. పుణే 80 శాతం (12,340 యూనిట్లు), ఎన్సీఆర్‌లో 51 శాతం (13,740), చెన్నైలో 42 శాతం (3,430), బెంగళూరులో 33 శాతం (15,580), హైదరాబాద్‌లో 33 శాతం (5,400), కోల్‌కతాలో18 శాతం (4,020) యూనిట్లు పెరిగాయి.

ఇదిలా ఉండగా, స్థిరమైన ధరలు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్ల వంటి కారణాలతో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో హౌసింగ్ మార్కెట్ చౌకగా మారిందని అంటున్నారు. హైదరాబాద్‌లోనూ ఇళ్లు అన్ని వర్గాలకు చేరువయ్యాయని, ఆర్థికంగా, సౌకర్యాలపరంగా అందరికీ అనువైన గృహాలు దేశంలో ఇప్పుడు భాగ్యనగరంలోనే అత్యధికంగా అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
ఈ మేరకు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ ఇండియా ఈ వివరాలు వెల్లడించింది. దేశంలో అతి చౌక హౌసింగ్ మార్కెట్ హైదరాబాద్ అని తేలిందని పేర్కొంది. గత ఏడాదికి గాను బుధవారం హోమ్ పర్చేజ్ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ను ఆవిష్కరించింది. ఇందులో హైదరాబాద్‌తో పాటు ఏడు ముఖ్య నగరాల రియల్ ఎస్టేట్‌పై సర్వే వివరాలను వెల్లడించింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే, హైదరాబాద్, కోల్‌కతా నగరాలపై అధ్యయనం చేసింది. ఇందులో చౌకగా అనువైన ధరల్లో హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా, కోల్‌కతా ఆ తర్వాత స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications