టీసీఎస్, గూగుల్, అమెజాన్ దాటేసిన ఫ్లిప్‌కార్ట్!: ఇండియన్స్ జాబ్ కోరుకునే టాప్ కంపెనీలు ఇవే
భారతదేశంలో పని చేసేందుకు అనువైన సంస్థల్లో ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫుడ్ ఆర్డర్ సంస్థ స్విగ్గీలు ఉన్నాయి. ప్రముఖ సెర్చింజన్ గూగుల్, ప్రఖ్యాత సాఫ్టువేర్ కంపెనీ టీసీఎస్ వంటి వాటిని కాదని అవి ముందుకు వచ్చాయి. ఈ మేరకు 2019కి సంబంధించి దేశీయ కంపెనీలతో రూపొందించిన జాబితాను లింక్డిన్ టాలెంట్ ఇన్‌సైట్స్ సంస్థ వెల్లడించింది. ఇందులో తొలి పది స్థానాల్లో ఇంటర్నెట్‌కు సంబంధించిన కంపెనీలు ఆధిపత్యం చూపాయి.
మొదటిస్థానంలో వాల్‌మార్ట్ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఈ సంస్థలో ఉద్యోగం చేయాలనే ఆసక్తిని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆమెజాన్, ఓయో (ఆన్‌లైన్ హాస్పిటాలిటీ కంపెనీ), వన్ 97 కామ్ (పేటీఎం), ఉబర్, స్విగ్గీ, టీసీఎస్, జొమాటో, అల్ఫాబెట్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ తర్వాత 11 నుంచి 25 స్థానాల్లో వరుసగా ఈవై, అడోబ్, బోస్టన్ కన్సల్ట్, యస్ బ్యాంక్, ఐబీఎం, డయమ్లర్ ఏజీ, ఫ్రెష్ వర్క్స్, యాక్సెంచర్, ఓలా, ఐసీఐసీఐ బ్యాంకు, పీడబ్ల్యుసీ ఇండియా, కేపీఎంజీ ఇండియా, లార్సెన్ అండ్ టుబ్రో, ఒరాకిల్, క్వాల్‌కామ్‌లు ఉన్నాయి. టాప్ 10లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఉబర్, అల్ఫాబెట్‌లు ఇంటర్నెట్‌కు సంబంధించినవి. ఓయో హాస్పిటాలిటీ, టీసీఎస్ ఐటీ అండ్ సర్వీసెస్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్ అండ్ ఎనర్జీ ఫీల్డులో ఉన్నాయి. స్విగ్గీ, జొమాటోలు ఫుడ్ డెలివరీ సంస్థలు. టాప్ 25లో మాత్రం యస్ బ్యాంకు, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగులు
సచిన్, బిన్నీ బన్సాల్‌లు ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. ఆ తర్వాత దీనిని వాల్‌మార్ట్ రూ.1.4 లక్షల కోట్లకు కొనుగోలు చేసింది. ఇందులో భారత దేశంలో 13,900 మంది ఉద్యోగులు ఉన్నారు. అలాగే, అమెజాన్ రెండో స్థానంలో ఉంది. ఇందులో 50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెజాన్ లర్నింగ్ (ఎంఎల్), అమెజాన్ వెబ్ సిరీస్ సర్వీసెస్ (ఏడబ్ల్యుఎస్)లు ఉన్నాయి. ఏప్రిల్ 2, 2019 అమెజాన్‌లో 1,950 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓయో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న పేటీఎం మాతృ సంస్థ వన్ 97లో హెచ్ఆర్, సేల్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో దూసుకెళ్తోంది.

ఉబెర్ వర్సెస్ ఓలా, జొమాటో వర్సెస్ స్విగ్గీ
ఉబెర్ సంస్థ ఐదో స్థానంలో ఉండగా, దాని పోటీదారు ఓలా మాత్రం 19వ స్థానంలో ఉంది. అలాగే, స్వీగ్గీ ఆరో స్థధానంలో ఉండగా, దాని పోటీదారు జొమాటో ఎనిమిదో స్థానంలో ఉంది. స్విగ్గీలో 6వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో స్విగ్గీ విలువ దాదాపు ఐదు రెట్లు పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో 700 మిలియన్ డాలర్లుగా ఉండగా, డిసెంబర్ కల్లా 3.3 బిలియన్ డాలర్లుగా ఉంది. బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్ సహా 75 నగరాల్లో ఉంది. జొమాటోకు నెలకు 21 మిలియన్ ఆర్డర్లు వస్తున్నాయి. అలాగే, ఐసీఐసీఐ కంటే యస్ బ్యాంకులో ఉద్యోగం కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.

టీసీఎస్, ఐబీఎం, యాక్సెంచర్
దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న టెక్ సంస్థ టీసీఎస్. ఇందులో 4.17 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ర్యాకింగ్‌లో ఏడో స్థానంలో నిలిచింది. ఇది వరల్డ్ నెంబర్ వన్ ఐటీ కంపెనీ. గూగుల్‌లో ప్రపంచవ్యాప్తంగా 98వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గూగుల్ 9వ స్థానంలో నిలిచింది. యాక్సెంచర్ 18వ స్థాంలో ఉంది. ఇందులో 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 15వ స్థానంలో ఉన్న ఐబీఎంలో 1 లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు.

మొదటిసారి ఎక్కువ కంపెనీకి చోటు
ఈ లిస్టులో సగం సంస్థలు మొదటిసారి చోటు దక్కించుకున్నాయని లింక్డిన్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ ఆదిత్ ఛార్లీ తెలిపారు. యువ నిపుణులను ఆకర్షించడం వల్లే ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి సంస్థలు కూడా ఇందులో చేరాయన్నారు. ఈ జాబితాలోని అధిక సంస్థలు ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం కొత్తగా ఎంపికలు చేస్తున్నాయని, తదుపరి కార్యకలాపాల నిర్వహణ, వ్యాపారాభివృద్ధికి సంబంధించినవి ఉంటాయని చెప్పారు. లింక్డిన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 61 కోట్ల మంది సభ్యులు, ఆయా ప్రాంతాల్లోని సంస్థలను ఎంచుకున్నారు. కంపెనీపై ఆసక్తి, ఉద్యోగులతో ఆయా సంస్థలకు ఉన్న అనుబంధం, ఉద్యోగుల్ని నిలుపుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన కంపెనీల్లో ఎక్కువ భాగం ఇంజినీరింగ్ విభాగాల్లోనే ఎక్కువ నియామకాలు జరిపాయి. ఆపరేషన్స్, వ్యాపార అభివృద్ధి తర్వాత స్థానాల్లో నిలిచాయి.


Click it and Unblock the Notifications