ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన ఆన్‌లైన్ ఆర్డర్ సేవలను దేశవ్యాప్తంగా మరో రెండు వందలకు పైగా పట్టణాలకు విస్తరించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. కొత్తగా 17 పట్టణాలలో సేవలు ప్రారంభించగా ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరు ఉన్నాయి. తమ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల సంఖ్య 213కు చేరిందని తెలిపింది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మరో 500 పట్టణాలకు ఈ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది.
ఏపీలో కొత్తగా మచిలీపట్నం, నంద్యాల, భీమవరం, ఒంగోలు, శ్రీకాకుళం, కడపలలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ నగరాలతో పాటు కేరళలోని కొట్టాయం, కొల్లాం, పంజాబ్‌లోని ఖన్నా, గురుదాస్‌పూర్, తమిళనాడులోని అంబుర్, జార్ఖండ్‌లో దియోగఢ్, ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్, షాజహాన్‌పూర్ పట్టణాలు, హిమాచల్ ప్రదేశ్‌లో సోలన్, హర్యానాలో పల్వాల్‌లో తమ సేవలను ప్రారంభించినట్టు తెలిపింది.

వేగంగా విస్తరిస్తున్న నగరాలు తమకు కీలకంగా మారాయని, ఈ ఏడాది చివరి నాటికి టోటల్ 50 శాతం ఆర్డర్ వ్యాల్యామ్ పెరుగుతుందని జొమాటో ఫౌండర్ అండ్ సీఈవో దీపేందర్ గోయల్ చెప్పారు. తమ కంపెనీలో 1.8 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్స్ ఉన్నారని, తాము ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. చిన్న నగరాల్లో జొమాటో కిచెన్ హబ్స్ డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ 24 దేశాల్లో, 1.4 మిలియన్ రెస్టారెంట్లతో అనుసంధానం కలిగి ఉంది.


Click it and Unblock the Notifications