2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 5.5 శాతం మేర తగ్గినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాల్యూపరంగా చూస్తే 29.5 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుమతి అయింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు 31.2 బిలియన్ డాలర్ల మేర ఉంది.
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశం భారత్. కానీ పసిడి దిగుమతి తగ్గుతుండటం వల్ల ఆ మెరుపు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల దిగుమతులు తగ్గుతున్నాయి. అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే ఇప్పుడు దిగుమతి తగ్గడం వల్ల కరెంట్ ఖాతా లోటును నియంత్రించడానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇది భారీ ఊరట.

ఆభరణాల మార్కెట్‌కు డిమాండ్
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం కూడా దిగుమతులు తగ్గేందుకు ప్రధాన కారణమని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడు నెలలపాటు (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న బంగారం దిగుమతులు జనవరిలో ఏకంగా 38.16 శాతం ఎగబాకి 2.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో 10.8 శాతం పెరిగి 2.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా పసిడి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఆభరణాల మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉంది.

తగ్గిన ఎగుమతులు
అయినప్పటికీ గత పదకొండు నెలల్లో జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు కూడా 6.3 శాతం తగ్గి 28.5 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను కరెంట్ ఖాతాలోటు జీడీపీలో 2.9 శాతంగా ఉంది. అంతకు క్రితం ఏడాది ఇది 1.1 శాతం. కాగా వ్యాల్యూపరంగా 2017-18లో భారత్ 955.16 ట న్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది దిగుమతి చేసుకున్న 780.14 టన్నులతో పోలిస్తే 22.43% అధికం. పసిడి దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం అంతగా కనిపించడం లేదు.

బంగారంపై సుంకం
భారత్-దక్షిణ కొరియా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన కూడా పన్నును విధించింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై భారత్ పది శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ఈ సుంకాన్ని తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేదు.


Click it and Unblock the Notifications