బెంగళూరు: మైండ్ ట్రీ బోర్డు ఈ నెల 26వ తేదీన సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీలోని వీజి సిద్ధార్థకు చెందిన 20.32 శాతం వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో మైండ్ ట్రీ టేకోవర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రయత్నాలను అడ్డుకొనేందుకు మైండ్‌ట్రీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లకు బైబ్యాక్ లేదా ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించాలా అనే అంశాలపై చర్చించనుంది.
ఇప్పటికే బైబ్యాక్ ఆఫర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ అండ్ టీ రూ.10,800 కోట్ల బలవంతపు బిడ్‌ను ఎదుర్కొనే అంశంపై చర్చించనుంది. ఈ విషయాన్ని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మైండ్ ట్రీని సొంతం చేసుకోవడం కోసం ఎల్ అండ్ టీ బలవంతపు టేకోవర్ బిడ్‌ను ప్రకటించింది. 66 శాతం వరకు వాటా కోసం రూ.10,800 కోట్లను ఆఫర్ చేసింది.

ముందుగా కాఫీ డే యజమాని వీజీ సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాను కొనుగోలు చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో బహిరంగ మార్కెట్ నుంచి మరో 15 శాతాన్ని సొంతం చేసుకోవడానికి బ్రోకర్ల ద్వారా ఆర్డర్లు పెట్టింది. మరో 31 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ప్రతిపాదిత కొనుగోలు 2019-20 తొలి త్రైమాసికంలో పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మైండ్ ట్రీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంటే ఎల్ అండ్ టీకి తొలుత ఉద్యోగులపరంగా సమస్య ఎదురయ్యే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఎల్ అండ్ టీ, మైండ్‌ట్రీ కంపెనీల్లో భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి.
మైండ్‌ట్రీలో స్వేచ్ఛాపూర్వక వాతావరణం ఉంటే, ఎల్ అండ్ టీలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. టేకోవరు తర్వాత కూడా మైండ్ ట్రీని ఎల్ అండ్ టీకి చెందిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో విలీనం చేసే అవకాశం లేకపోయినప్పటికీ మైండ్‌ట్రీ ఉద్యోగులు కొత్త సంస్కృతిలో ఇమడలేక కంపెనీని వీడిపోయే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ప్రస్తు తం మైండ్ ట్రీలో దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు. టేకోవరు అనంతరం మైండ్ ట్రీని ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో విలీనం చేస్తారా లేక కంపెనీకి చెందిన కొన్ని వ్యాపారాలను వేరు చేసి వాటిని ఎల్ అండ్ టీకి చెందిన మరో కంపెనీ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో కలిపి మైండ్‌ట్రీని కొనసాగిస్తారా అనే అంశంపై స్పష్టత రావాలంటున్నారు. టేకోవర్ ఏదైనా రెండు కంపెనీలు కలిసినప్పుడు ముందుగా ఎదురయ్యే ప్రధాన సమస్య ఒక కంపెనీ సంస్కృతి, విధానాల్లో మరో కంపెనీ ఉద్యోగులు ఇమడలేకపోవడమేనని చెబుతున్నారు. మైండ్ ట్రీ సేవలు పొందుతున్న ఖాతాదారులపై కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
గతంలో సత్యం కంప్యూటర్స్‌ను టెక్ మహీంద్రా సొంతం చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. సత్యం కం ప్యూటర్స్‌లో ఉండే పరిస్థితులకు భిన్నమైన పరిస్థితులు టెక్ మహీంద్రాలో ఉన్నాయని, దీంతో అప్పట్లో చాలామంది సత్యం కంప్యూటర్స్ ఉద్యోగులు ఆ కంపెనీని వీడి పోయారని చెబుతున్నారు. సత్యంను టెక్ మహీంద్రా హస్తగతం చేసుకున్న తర్వాత కొన్నాళ్లు ఆ కంపెనీని టెక్ మహీంద్రా అలానే కొనసాగించింది. ఆ తర్వాత మహీంద్రా సత్యంగా పేరు మార్చింది. కొంత కాలం తర్వాత దాన్ని టెక్ మహీంద్రాలో విలీనం చేసింది.


Click it and Unblock the Notifications