న్యూఢిల్లీ : ఎప్పటి నుంచో విమాన ప్రయాణీకులు చేస్తున్న డిమాండ్ ఎట్టకేలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ చెవిన పడింది. ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను రద్దు చేసింది. ఫ్లైట్ టికెట్ రద్దు చేసుకుంటే ఇంతకాలం విమాన సంస్థలు ఆ డబ్బును పూర్తిగా వెనక్కి ఇచ్చేవి కావు. పది వేలు పెట్టి టికెట్ కొన్నా ఒక్కోసారి రూ.1000 కూడా వెనక్కి రాని పరిస్థితిని మనం ఇప్పటివరకూ చూస్తూ ఉన్నాం. దేశీయ విమానయాన సంస్థలు పాటిస్తున్న ఈ వింత నిబంధనపై ఎప్పటి నుంచో అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు కూడా దీనిపై కంప్లైంట్స్ అందాయి. తాజాగా డిజిసిఏ.. విమాన సంస్థలకు షాకిచ్చేలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం ప్రయాణీకుడు టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు ఫ్లైట్ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి రుసుమునూ ఏవియేషన్ సంస్థలు వసూలు చేయడానికి లేదు. 24 గంటలు దాటితే మాత్రమే ఫ్లైట్ సంస్థలు తమ పాత విధానాన్నే కొనసాగించవచ్చు. మరో ముఖ్య అంశం డెస్టినేషన్ మార్పు. టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోపు మనం వెళ్లాల్సిన ప్రదేశం మార్చుకుంటే రద్దు ఛార్జీలను వసూలు చేయకుండా అందుకు సంబంధించిన అదనపు ఛార్జీలను మాత్రమే చెల్లించి టికెట్ మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటును కూడా విమాన సంస్థలు కల్పించాల్సి ఉంది.

పేరు కూడా మార్చుకోవచ్చు
ఒకప్పుడు పేరు తప్పు పడినా.. లేక మరో కారణం చేత పేరు మార్చాల్సి వచ్చినా విమాన సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసేవి. తాజా నిబంధనల నేపధ్యంలో ఏవియేషన్ సంస్థలు పేరు మార్చేందుకు అధికంగా డబ్బులు వసూలు చేయడం కుదరదు. అంతేకాదు పేరు మార్చుకునేందుకు వెసులుబాటును కూడా వాళ్లు కల్పించాల్సి ఉంటుంది.

ఫ్లైట్ లేట్ అయితే..
ఇంతకాలం ఫ్లైట్ సంస్థలు తమ ఆలస్యంతో ప్రయాణీకులను నానా తిప్పలు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. ఏదో ఒక కారణంగా గంటలకు గంటలు ప్రయాణీకులను పడిగాపులు కాయించిన సంఘటనలు ఉండేవి. కొన్ని సందర్భాల్లో చెప్పాపెట్టకుండా క్యాన్సిల్ కూడా చేసేస్తారు. అయితే ఇకపై విమాన సంస్థలు అలా రద్దు చేస్తే రూ.5-10 వేల వరకూ ప్రయాణీకులకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

లగేజ్ పోతే..
కొన్ని సందర్భాల్లో ఫ్లైట్లు మారినప్పుడు లేక మరో కారణం చేత ప్రయాణీకుల లగేజ్‌లు గల్లంతయ్యేవి. అప్పుడు కూడా విమాన సంస్థలు తూతూ మంత్రంగా ఏదో సాకులు చెప్పేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం అవి కుదరబోవు. డొమెస్టిక్ ప్రయాణంలో లగేజ్ పోతే కిలో రూ.350 చొప్పున రూ.20 వేల వరకూ నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇది కేవలం రూ.3 వేలు మాత్రమే ఉండేది. దాన్ని ఏకంగా ఏడు రెట్లు సవరించి ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కల్పించింది డీజీసీఏ. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనేది స్పష్టత లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేస్తారా లేదా అనే అంశాన్ని త్వరలో ధృవీకరించబోతున్నారు.


Click it and Unblock the Notifications