ఈ సారి ఆంధ్రప్రదేశ్ మంత్రుల వంతు మంత్రి నారాయణ పై ఐటీ దాడులు!
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకుల మీద మరియు ప్రముఖుల మీద వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి.నిన్న రేవంత్ రెడ్డి నేడు మంత్రి నారాయణ.
ఇటీవల తెలంగాణలోని పలువురు రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఐటీ ఇప్పుడు ఏపీపై గురిపెట్టింది. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు జరిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ఐటీ ఫోకస్ చేసింది. పక్కా ప్రణాళికతో ఓ జాబితాను తయారుచేసుకుని వారిపై దాడులకు సిద్దమైంది.

ఈ నేపథ్యంలో గురువారం రాత్రే చెన్నై నుంచి భారీ సంఖ్యలో ఓ ఐటీ టీమ్ ఏపీలో దిగినట్టు సమాచారం. విజయవాడ చేరుకున్నాక వీరంతా ఆరు బృందాలుగా ఏర్పడి తనిఖీలకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి నారాయణ సంస్థలపై ఐటీ సంస్థలు సోదాలు జరుపుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే నారాయణ సంస్థల అధికారులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.
సదరన్ కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యంతో పాటు నెల్లూరు జిల్లా బీదా మస్తాన్ రావు సంస్థల్లోనూ ఐటీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. విజయవాడ కేంద్రంగా ఐటీ అధికారులు సోదాలకు దిగడం ఉత్కంఠను రేపుతోంది. నిజానికి ఐటీ దాడులు జరుగుతాయని ఏపీ అధికార పార్టీ టీడీపీ రెండు రోజులు ముందుగానే పసిగట్టింది. రాజకీయ కోణంలోనే తమపై ఈ దాడులు జరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. టీడీపీలో ఎవరైతే కీలక నేతలుగా ఉన్నారో వారిపై ఐటీ దాడులు జరగబోతున్నట్టు ఊహాగానాలు వినిపించడంతో పార్టీలో తీవ్ర కలకలం మొదలైంది.


Click it and Unblock the Notifications