దేశ వృద్ది రేటు తగ్గింది... అదానీ సంపద మాత్రం పెరిగింది
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు కార్పొరేట్ల నికర ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతోంది. నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు లాంటి చర్యల వల్ల ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే బడా ప
దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోతుంటే మరోవైపు కార్పొరేట్ల నికర ఆస్తుల విలువ మాత్రం భారీగా పెరిగిపోతోంది. నోట్ల రద్దు, జిఎస్‌టి అమలు లాంటి చర్యల వల్ల ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే బడా పెట్టుబడిదారులు మాత్రం పెద్ద ఎత్తున బాగు పడ్డారు. ఇందుకు నిదర్శనం గతేడాది పలువరి సంపద పరుగులు పెట్టడమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మిత్రుడు గౌతమ్ అదానీ సంపద అమాంతం పెరిగింది. దేశంలోనే నౌకాశ్రయాల నిర్వహణలో అదానీ అతిపెద్ద కార్పొరేట్‌గా ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప్రకారం 2017 ఏడాదిలో అదానీ నికర సంపద అత్యధికంగా 124.6 శాతం ఎగిసింది. 2017 డిసెంబర్ 31 నాటికి ఆయన మొత్తం సంపద 10.4 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది జనవరి నాటికి అదానీ ఆస్తులు 4.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారతదేశంలో 30 మంది అపర కుబేరులు

అదానీ తర్వాత డిమార్ట్ యాజమాని రాధాక్రిష్ణన్ దమాని సంపద 80 శాతం పెరిగి 6.96 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది మార్చి నాటికి ఆయన ఆదాయం 3.88 బిలియన్ డాలర్లుగా ఉంది. ధమానీ ప్రస్తుతం ముంబయి కేంద్రంగా అవెన్యూ సూపర్ మార్కెట్స్ గ్రూపులో భాగంగా డి-మార్ట్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. 2017 మార్చిలో దమానీకి చెందిన అవెన్యూ సూపర్ మార్కెట్స్ లిస్టింగ్‌కు వచ్చింది. ఈ కంపెనీ ఈక్విటీ షేర్‌ను రూ.299తో ఇష్యూ చేసింది. కాగా జనవరి 8 నాటికి ఈ సూచీ విలువ అమాంతం 340 శాతం పెరిగి రూ.1,235కు చేరింది. దీంతో ఆయన ఆదాయం భారీగా పెరిగింది.
కాగా కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ నికర సంపద 77.53 శాతం పెరిగి 40.30 బిలియన్ డాలర్లకు చేరింది. 2017లో ఆయన ప్రపంచంలోనే 20వ అతిపెద్ద కుబేరుడిగా గుర్తింపు పొందారు. కాగా 2017 జనవరిలో ముఖేష్ ఆదాయం 22.70 బిలియన్లుగా ఉంది. గతేడాది కుమార్ బిర్లా, అజీమ్ ప్రేమ్‌జీ, ఉదరు కొటాక్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్‌ల నికర సంపద వరుసగా 50.41 శాతం, 46.72 శాతం, 44.87 శాతం, 44.03 శాతం, 36.11 శాతం చొప్పున పెరిగింది. అదే విధంగా పల్లోంజీ మిస్త్రీ, సైరస్ పునవల్లా, శివ్ నాడార్‌ల నికర ధనం వరుసగా 27.01 శాతం, 16.50 శాతం, 15.83 శాతం చొప్పున పెరిగి వరుసగా 17.40 బిలియన్లు, 9.32 బిలియన్లు, 13.90 బిలియన్లకు చేరింది.
మరోవైపు 2017 డిసెంబర్ 31 నాటికి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు జెఫ్ బెజోస్ సంపద 52 శాతం ఎగిసి 99 బిలియన్లకు చేరింది. జనవరి 2017లో ఆయన ఆదాయం 65 బిలియన్లుగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ పోర్టల్ అమెజాన్‌కు బెజోస్ వ్యవస్థాపకులుగా ఉన్నారు. రెండు, మూడు స్థానాల్లో ఉన్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌ల నికర ఆస్తులు వరుసగా 12 శాతం, 17 శాతం పెరిగి 91.8 బిలియన్లు, 85.3 బిలియన్లకు చేరింది.


Click it and Unblock the Notifications