దేశంలో కొత్త ఉద్యోగాలు లేవంట
దేశీయ కంపెనీలు వేతనాల వ్యయాన్ని నియంత్రించడానికి కీలక ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో వచ్చే కొద్ది నెలల్లో నూతన ఉద్యోగాల నియామకాలు పెద్దగా ఉండబోవని అసోచామ్ ఆదివారం పేర్కొ
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు రంగంలో పెద్దగా కొత్త ఉద్యోగాలు లేవంట. దేశీయ కంపెనీలు వేతనాల వ్యయాన్ని నియంత్రించడానికి కీలక ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో వచ్చే కొద్ది నెలల్లో నూతన ఉద్యోగాల నియామకాలు పెద్దగా ఉండబోవని అసోచామ్ ఆదివారం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూలధనాన్ని సమకూర్చిన తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా తమ ఉద్యోగుల వేతనాల వ్యయాన్ని తగ్గించుకుంటాయని, అందువల్ల నూతన ఉద్యోగాల కల్పన తగ్గుతుందని తెలిపింది.

అసోచామ్ తన సభ్యుల నుంచి స్వీకరించిన గణాంకాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం పనితీరును మెరుగుపరచుకోవడం, పటిష్ఠం కావడం, ప్రధానం కాని వ్యాపారాల నుంచి బయటపడటం, బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచుకోవడంపై బ్యాంకులు దృష్టి పెట్టాయని అసోచామ్ తెలిపింది. వచ్చే మూడు నెలల నుంచి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడంలో, రుణ వ్యయాన్ని తగ్గించుకోవడంలో పూర్తిగా దృష్టి సారించి ఉంటాయని అసోచామ్ పేర్కొంది. ప్రధానంగా టెలికాంతో పాటు ప్రైవేటు బ్యాంకులు,బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సహా ఆర్థిక సేవా సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్థిరాస్థి రంగం,మౌలిక రంగాల్లో వేతనాల వ్యయాన్ని తగ్గించుకోవడం, లాభాలను పెంచుకోవడంపై కసరత్తు సాగుతోందని అసోచామ్ తెలిపింది. మూడీస్ భారత సావరిన్ రేటింగ్‌ను పెంచడం సానుకూలాంశంగా మారినప్పటికీ, వచ్చే రెండు త్రైమాసికాలు ప్రైవేటు రంగానికి సవాలుగానే ఉంటాయని అసోచామ్ సెక్రెటరి జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. అయితే 2018 ఏప్రిల్ నుంచి పరిస్థితులు కుదుట పడతాయని, అధిక రుణభారం, వినియోగదారుల నుంచి నెమ్మదించిన డిమాండ్ వంటి అంశాలు కొంత వరకు చక్కబడతాయని పేర్కొన్నారు. అనుకోని అవాంఛనీయ ఘటనలు ఏమైనా సంభవిస్తే తప్ప, 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కన్నా మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications