రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి జోష్‌నిచ్చిన బడ్జెట్
ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రేటును కొంతవరకు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్ని రకాల మినహాయింపులను కూడా ప్రకటించారు. వాటితో పాటు చిన్న చిన్న షాక్‌లు సైతం ఇచ్చా
ఏడాదికి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను రేటును కొంతవరకు తగ్గించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్ని రకాల మినహాయింపులను కూడా ప్రకటించారు. వాటితో పాటు చిన్న చిన్న షాక్‌లు సైతం ఇచ్చారు. వ్యక్తిగత పన్నులకు సంబంధించి పన్ను ప్రభావాలు ఇలా ఉన్నాయి...

బడ్జెట్ తర్వాత ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు
| సంవత్సర ఆదాయం | పన్ను |
|---|---|
| రూ. 2.5 లక్షల లోపు | లేదు |
| రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ | 5% |
| రూ. 5-10 లక్షలు | 20% |
| రూ. 10 లక్షల పైన | 30% |
| రూ. 50 లక్షలు - కోటి | 10% సర్‌చార్జీ |

రూ. 50 నుంచి రూ.కోటి వార్షికాదాయం కలిగిన వారిపై 10% సర్‌చార్జీ
రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్నును 5 శాతానికి తగ్గించడం మధ్యతరగతికి సంతోషం కలిగించే విషయం. భారీగా జరుగుతున్న పన్ను ఎగవేతలను తగ్గించేందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో నల్లధనం దాచిన వారిని వదిలి మధ్య తరగతిని ఏ మాత్రం వదలకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం కలిగిన వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారంతా ఇకపై 10% సర్‌చార్జీని అదనంగా చెల్లించాలి.

2 కోట్ల మందికి రూ. 3 వేల ఊరట
5 లక్షల రూపాయల వార్షికాదాయం దాటని వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పన్ను మినహాయింపు ప్రస్తుతం రూ. 2వేలు మాత్రమే ఉండగా, దాన్ని ఇప్పుడు 5 వేలకు పెంచారు. దాంతో దాదాపు 2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఒక్కొక్కరికి రూ. 3వేల చొప్పున ఊరట లభిస్తుంది.

గృహ రుణానికి సంబంధించి
సొంత ఇళ్లు ఉన్నవారికి గృహరుణాల మీద చెల్లించే అసలు, వడ్డీకి ఆదాయపన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ సొంత ఇళ్లు లేకుండా అద్దె ఇళ్లలో ఉండేవారికి వారు ఏడాదికి చెల్లించే అద్దె మీద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80జిజి కింద ఇప్పటివరకు ఏడాదికి 24 వేల రూపాయల వరకు కట్టే అద్దె మీద పన్ను మినహాయించేవారు. ఈ పరిమితిని ఇప్పుడు రూ. 60 వేలకు పెంచారు.

వ్యాపారుల కోసం రూ. కోటి టర్నోవర్
ఇప్పటివరకు కోటి రూపాయల వార్షిక టర్నోవర్ దాటని చిన్న, మధ్యతరహా నాన్ కార్పొరేట్ వ్యాపారులకు సెక్షన్ 44ఎడి కింద ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీం అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికైతే దాదాపు 33 లక్షల మంది చిన్న వ్యాపారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే, వారంతా ఇకపై ఖాతా పుస్తకాలను వివరంగా నిర్వహించాల్సి రావడం, ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ టర్నోవర్ పరిమితిని ఇప్పుడు 2 కోట్ల రూపాయలకు పెంచారు. దాంతో మరింతమంది వ్యాపారులు ఎంఎస్ఎంఈ(చిన్న,మధ్య తరహా) విభాగంలోకి వస్తారు.

వృత్తి నిపుణులకు
50 లక్షల రూపాయల వరకు స్థూల ఆదాయం వచ్చే వృత్తి నిపుణులకు కూడా ప్రిజంప్టివ్ టాక్సేషన్ స్కీంను అందుబాటులోకి తెచ్చారు.
మామూలుగా ఎన్‌పీఎస్‌కు సంబంధించి 20% సొమ్ముకు ఉద్యోగులకు మినహాయింపులు ఉన్నట్లుగానే వృత్తి నిపుణులకు సైతం ఇదివరకూ ఉన్న పది శాతాన్ని 20 శాతానికి పెంచడం హర్షణీయం.

పన్ను రిటర్నులు చేయకపోతే కొరడా
నిర్దేశించిన గడువు లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటీఆర్స్) దాఖలు చేయకుండా జాప్యం చేశారో ఇక పన్ను చెల్లింపుదారులు భారీ జరిమానానే కట్టాల్సిందే. ఐటీఆర్స్ రిటర్నులు ఫైల్ చేయడంలో జాప్యం చేస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నామని ఫైనాన్సియల్ బిల్లు 2017 మొమోరాండంలో పొందుపరిచారు. కానీ ఈ జరిమానా అమలు 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐటీ చట్టంలోని కొత్త సెక్షన్ 234ఎఫ్ కింద ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. 2018-19 ఆర్థికసంవత్సరం నుంచి గడువు లోపు పన్ను రిటర్నులు దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తే దానికి తగ్గ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఫైనాన్సియల్ బిల్లు 2017 మొమో పేర్కొన్నారు.

జరిమానాలు ఇలా...
రెండు స్థాయిల్లో ఈ జరిమానా విధించనున్నారు. నిర్దేశిత గడువు అనంతరం అంటే ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ 31కు ముందు లేదా అదేరోజు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5వేల చార్జీలను కట్టాల్సి ఉంటుంది. మరేదైనా సందర్భాల్లో అయితే రూ.10వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని ఈ మొమోరాండంలో స్పష్టపరిచారు. అదేవిధంగా మొత్తం ఆదాయం రూ.5 లక్షల దాటని వారికి కేవలం 1000 రూపాయలే జరిమానా విధించనున్నారు. ఐటీ చట్టంలోని ఈ సవరణలన్నీ 2018 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఈ మొమోరాండం పేర్కొంది.

అధిక ఆదాయ వర్గాలకు ఏమీ లేదు
అధిక ఆదాయ వర్గాల్లో ఉన్న వారు తమకూ పన్ను పోటు తగ్గుతుందని బడ్జెట్లో ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనిపై ఎటువంటి మార్పులు జరగలేదు. ఏది ఏమైనప్పటికీ నోట్ల రద్దు తర్వాత విపరీతంగా బాధపడిన బడుగు జీవిని ఆదుకునేందుకు బడ్జెట్ కొంతమాత్రం ఉపయోగపడింది. పన్ను చెల్లింపుదార్లా ఇప్పటికైనా పన్ను సక్రమంగా చెల్లించి దేశాభివృద్దికి పాటుపడండి.


Click it and Unblock the Notifications