పంట రుణాలపై రెండు నెలల వడ్డీ మాఫీ
నోట్ల రద్దు నేపథ్యంలో రెండు నెలల కాలానికి రైతు రుణాలపై వడ్డీ మాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది న
నోట్ల రద్దు నేపథ్యంలో రెండు నెలల కాలానికి రైతు రుణాలపై వడ్డీ మాఫీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్‌ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం వడ్డీ రాయితీ కోసం ప్రభుత్వం రూ. 1060.50 కోట్లను నాబార్డు గ్రాంట్, రైతు రుణ వడ్డీ చెల్లింపుల కోసం కేటాయిస్తోంది.

సాధారణంగా స్వల్పకాలిక రుణాల కింద రూ. 3 లక్షల లోపు వాటికి 7 శాతం వడ్డీనీ వసూలు చేస్తారు. రైతులు సకాలంలో రుణాలను చెల్లించినట్లయితే అదనంగా మరో 3% వడ్డీ రాయితీని కేంద్రమే భరిస్తోంది. ఇవన్నీ వడ్డీ రాయితీ పథకం కింద రైతులు తీసుకున్న రుణాలకు మాత్రమే వర్తిస్తాయి.

గ్రామీణ ఇళ్లకు కొత్త శోభ
గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు నిర్మించడానికి, లేదా ప్రస్తుత ఇంటినే మరమ్మతు చేసుకునేందుకు తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా గతంలో ఈ పథకాన్ని ప్రకటించారు.


Click it and Unblock the Notifications