ముంబై: ఈ ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 25,000 తపాలా కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించడంతో పాటు 1,000 వరకు ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) పేర్కొంది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 12,441 కార్యాలయాల్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న తపాలా విభాగం, 300 ఏటీఎంలను కలిగి ఉంది. ఖాతాదారులు ఎక్కడి నుంచైనా సేవలు వినియోగించుకునేలా శాఖలన్నింటినీ కోర్ బ్యాంకింగ్ సిస్టం(సీబీఎస్)తో అనుసంధానించనున్నారు.

2017 మార్చి నాటికి 1,30,000 గ్రామీణ తపాలా కార్యాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయడంతోపాటు, బయోమెట్రిక్ పరికరాలు అందించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి పరికరాలను తొలి విడతగా ఈ ఏడాది మార్చిలోపు 20,000 కార్యాలయాలకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
అదే విధంగా చెల్లింపు బ్యాంకుకు సంబంధించి కన్సల్టెంట్లను ఈ నెలాఖరుకల్లా తపాలా శాఖ ఖరారు చేయనుంది.


Click it and Unblock the Notifications