బెంగుళూరు: ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ, కన్సల్టెంగ్ కంపెనీ క్యాప్‌జెమిని, ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా శ్రీనివాస్ కందుల బుధవారం నియమితులయ్యారు. నిన్నటి వరకు సీఈఓగా పనిచేసిన అరుణ జయంతి స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా అరుణ జయంతి గ్లోబల్ బీపీఓ హెడ్‌గా కొనసాగుతున్నారు. క్యాప్‌జెమిని ప్రస్తుతం ఐఎంఎస్, టెస్టింగ్, ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్స్, అప్లికేషన్స్ తదితర రంగాల్లో తన సేవలను అందిస్తోంది. రాబోయే రోజుల్లో క్లౌడ్, డిజిటల్, కొత్త సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వనుంది.
2007లో ఐగేట్‌లో చేరిన శ్రీనివాస్ కందుల మానవ వనరుల విభాగానికి హెడ్‌గా ఉన్నారు. దీంతో పాటు నాణ్యత, వ్యాపార వ్యూహాల విభాగాల్లో ఆయన పనిచేశారు. 2011లో పాట్నీ కంప్యూటర్స్‌ను ఐగేట్ కొనుగోలు చేయటంలో, ఆ తర్వాత ఐగేట్‌ను క్యాప్‌జెమెనీ సొంతం చేసుకోవడంలో ముఖ్య భూమిక పోషించారు.

4 బిలియన్ డాలర్ల (రూ.26,000 కోట్లకు పైగా) డబ్బు చెల్లించి ఐగేట్‌ను క్యాప్‌జెమిని 2014లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు క్యాప్‌జెమిని ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా శ్రీనివాస్ కందులకు స్థానం కల్పించినట్లు క్యాప్‌జెమిని ప్రకటనలో పేర్కొంది.
ఐగేట్‌ను కొనుగోలు చేసిన తర్వాత తమ వ్యాపార కార్యకలాపాల్లో ఇండియా పాత్ర పెరిగినట్లు, వివిధ విభాగాల్లో శ్రీనివాస్ కందులకు ఉన్న సుదీర్ఘ అనుభవం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు క్యాప్ జెమినీ గ్రూప్ ఛైర్మన్, సీఈఓ పాల్ హెర్మెలిన్ పేర్కొన్నారు.
కాగా, క్యాప్‌జెమినికి ప్రపంచ వ్యాప్తంగా 1.8 లక్షల మంది సిబ్బంది ఉంటే, భారత్‌లో 87,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 800 మంది క్లయింట్లకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. 2014లో 10.57 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications