అవినీతికి అడ్డుకట్ట: అంతా ఈ-మెయిల్ ద్వారానే
ముంబై: పన్ను చెల్లింపుదారులకు ఐటీ అధికారుల నుంచి వేధింపులు తగ్గించాలనే ఉద్దేశంతో ఐటీ డిపార్ట్‌మెంట్ మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (206-17) నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో అన్ని రకాల సంప్రదింపులను ఇ-మెయిల్ ద్వారానే జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇలా చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పన్ను చెల్లింపుదారులు సంబంధిత కార్యాలయాలను సందర్శించే అవసరం లేకుండా చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపునకు సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, నోటీసులను జారీ చేయడానికి ఇకపై ఈమెయిల్‌ను ఉపయోగించాలని ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై నగరాలకు చెందిన ఐటీ రిటర్నుల తనిఖీ కోసం మదింపు అధికారులు పన్ను చెల్లింపుదారులతో ఈ-మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు రెవెన్యూ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
పన్ను చెల్లింపు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు, ఇందుకు సంబంధించి సంప్రదింపుల సమచారాన్నంతటినీ సెంట్రల్ సర్వర్‌లో భద్రపర్చడం జరుగుతుందని, అవసరమైనప్పుడు ఈ వివరాలను పునః పరిశీలించేందుకు వీలుంటుందని ఉన్నతాధికారి తెలిపారు.


Click it and Unblock the Notifications