ముంబై: సీసం శాతం అధికంగా ఉందని ఐదు నెలల కిందట దేశ వ్యాప్తంగా నిషేధించబడిన మ్యాగీ నూడుల్స్ తిరిగి సోమవారం మార్కెట్లోకి వచ్చాయి. నాణ్యతా పరీక్షల్లో విజయం సాధించి, నిషేధం నుంచి బయటపడ్డ స్విస్‌కు చెందిన నెస్లే నూడూల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
అంతేకాదు తాజాగా ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ద్వారా కూడా మ్యాగీ నూడుల్స్‌ను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. "ఈరోజు నుంచి నూడిల్స్‌ను మార్కెట్ లోకి విడుదల చేశాం. మ్యాగీ నిషేధం ఎదుర్కొన్న కాలం నెస్లేకు గడ్డుకాలం. పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా మళ్లీ మా ఉత్పత్తి సరైనదేనని నిరూపించుకున్నాం" అని నెస్లే ఇండియా ట్విట్టర్‌లో పేర్కొంది.
కర్నాటక, పంజాబ్, గోవాల్లోని తమ ప్లాంటలో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని నెస్లే ఇండియా ప్రారంభించింది. బాంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా ఉత్పత్తి చేసిన బ్యాచ్‌ల్లోని ఉత్పత్తులను మూడు లాబరేటరీలకు పరీక్షల నిమిత్తం పంపుతామని నెస్లే ఇండియా ఈనెల మొదటివారంలో బిఎస్‌కి వెల్లడించింది.

ఈ లాబరేటరీల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మ్యాగీ నూడుల్స్ తన విక్రయాలను ఈరోజు మొదలు పెట్టింది. ప్రస్తుతానికి మూడు ప్లాంట్లలో మ్యాగీ ఉత్పత్తిని ప్రారంభించిన నెస్లే ఇండియా త్వరలో దేశంలోని మిగిలిన ప్లాంటన్నింటిలో ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తోంది.
ఈ మేరకు ఆయా రాష్ట్రాల అథారిటీలతో ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించి చర్చలు జరుపుతోంది. ఎంఎస్‌జి పాళ్లు అధికంగా ఉన్నాయనే కారణంతో ఈ ఏడాది మే నెలలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎ దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీంతో నెస్లే ఇండియా మొత్తం మ్యాగీ ఉత్పత్తిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేసింది. దీంతో కంపెనీకి దాదాపు రూ. 435 కోట్ల నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications