హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఉద్యోగావకాశాలు
హైదరాబాద్: నగరంలో ఉద్యోగావకాశాలు నిరుడితో పోల్చితే 27 శాతం పెరిగినట్లు ఉద్యోగాన్వేషణ సంస్థ నౌకరి.కామ్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను నౌకరి.కామ్ జాతీయ హెడ్ సేల్స్, ఉపాధ్యక్షులు వి సురేష్ విడుదల చేశారు.
ఒక్క జూలై నెలలోనే నిరుడితో పోల్చితే 10 శాతం వరకు వృద్ధిరేటు నమోదైందని తెలిపారు. బిపిఓ, ఐటి రంగంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని చెప్పారు. బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్‌లో 32 శాతం, సమాచార టెక్నాలజీ (ఐటి)లో 31 శాతం హైరింగ్ కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు.

అదే విధంగా ఫార్మా సెక్టార్‌లో 6 శాతం వరకు వృద్ధి ఉందని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పారు. ఉద్యోగాలను ఆశించేవారికి ఇంతకంటే శుభవార్త ఏముంటుందని, మున్ముందు ఇంకా పెరుగుతాయని సురేష్ అన్నారు.
కాగా, బ్యాంకింగ్, టెలికాం రంగాల్లోనూ మంచి వృద్ధి రేటు నమోదైంది. బ్యాంకింగ్‌లో 25 శాతం, టెలికాంలో 24 శాతం ఉద్యోగ నియామకాలు జరిగాయని పేర్కొన్నారు. ఆటో, నిర్మాణ రంగంలో కూడా పాజిటివ్ అభివృద్ధి నమోదైంది. ఆటో రంగంలో 16 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతానికి చేరాయని తెలిపారు.


Click it and Unblock the Notifications