హైదరాబాద్: పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. సోమవారం కెసిఆర్‌ను కలిసేందుకు సిఐఐ అధ్యక్షుడు అజయ్ ఎస్ శ్రీరామ్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. వీరంతా సచివాలయంలో కెసిఆర్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పారిశ్రామిక రంగానికి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. విద్యుత్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, బ్రాండింగ్ తెలంగాణ సహా వివిధ అంశాలపై ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు కూడా పాల్గొన్నారు.

ప్రధానంగా పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కరించటంతోపాటు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కృషి చేయనున్నట్లు చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు. ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు సిఐఐ ప్రెసిడెంట్ అజయ్ ఎస్ శ్రీరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కె చంద్రశేఖర్ రావు పారిశ్రామిక సంఘాలు, కార్పొరేట్ సంస్థల అధిపతులు, వాణిజ్య సంస్థల ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు తమ ఆకాంక్షలను ఆయన ముందుంచారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణలో పారిశ్రామిక, వర్తక-వాణిజ్య రంగాలు మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఫ్యాప్సీ అధ్యక్షుడు శివ్ కుమార్ రుంగ్టా, ఉపాధ్యక్షుడు వి. అనిల్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications