న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. మోడీ ప్రభుత్వం వస్తే మరిన్ని ఉద్యోగాలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు స్నేహశీలిగా ముద్రపడిన మోడీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా కీలకమైన తయారీ రంగం పుంజుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ నాయకత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటైతే కనీసం 30 శాతం ఉద్యోగాలు పెరుగుతాయని హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ సంస్థ యునిసన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
ఒకవేళ మెజారిటీ స్థానాలు గెలుచుకుని కేంద్రంలో బిజెపి సొంతంగానే అధికారంలోకి వస్తే 15 నుంచి 20 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయని యునిసన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. ఇక ఇదే తరహా అభిప్రాయాన్ని కెరీర్ బిల్డర్ ఇండియా సంస్థ కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న జిడిపి వృద్ధిరేటుతోనే రెండు మిలియన్ల ఉద్యోగాలను మోదీ ప్రభుత్వం తీసుకురాగలదని పేర్కొంది.
రాబోయే ఏడాది నుంచి రెండేళ్లలో జిడిపి 5.5 శాతం నుంచి 6 శాతానికి చేరుతుందన్న ఆ సంస్థ.. అప్పుడు ఈ రెండు మిలియన్ల ఉద్యోగాలకుతోడు మరో 20 శాతం ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కెరీర్ బిల్డర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమ్‌వూష్ మచామ తెలిపారు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగంపై మోడీ ప్రత్యేక దృష్టి సారిస్తారన్న విశ్వాసం ఉండటంతో ఆ రంగంలో ఉద్యోగవకాశాలు మెరుగుపడతాయని ఆన చెప్పారు.

అలాగే ఐటి, మౌలిక రంగం, బ్యాంకింగ్, పర్యాటకం, హెల్త్‌కేర్ రంగాలకు సైతం ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ఉండే వీలుందని, కాబట్టి ఈ రంగాల్లో ఉద్యోగవకాశాలు పెరుగుతాయన్ని పేర్కొన్నారు. యుపిఏ ప్రభుత్వంలో పరిశ్రమల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం లభించలేదని పేర్కొన్నారు. తయారీ రంగం పుంజుకుంటుందని తాము భావిస్తున్నట్లు యునిసన్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదిత్ మిట్టల్ తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమై అన్ని మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని నమ్ముతున్నట్లు చెప్పారు.
కాగా, నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన ప్రతీ ప్రసంగంలో తయారీ రంగం పుంజుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్పాదక రంగమే ఉద్యోగాలను గణనీయంగా సృష్టిస్తుందని మోడీ భావించడమే దీనికి ప్రధాన కారణం. ఇక ఏటా 12 మిలియన్ల యువతకు ఉద్యోగవకాశాలను ఏర్పరచాల్సిన పరిస్థితి ఉందని రాండ్‌స్టడ్ ఇండియా సిఈఓ మూర్తి ఉప్పలూరి తెలిపారు. ఈ క్రమంలోనే ఉద్యోగవకాశాలు భారీగా రావాలంటే ఇతర రంగాల్లో కంటే తయారీ, మౌలిక రంగాల్లో మంచి వృద్ధిరేటు ముఖ్యమని చెప్పారు.


Click it and Unblock the Notifications