వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్ సంస్థ సిఇవో పదవికి ఇద్దరు భారతీయులు పోటీ పడుతున్నారు. దీంతో ఇది హైదరాబాద్ వర్సెస్ చెన్నైగా మారింది. హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెల్లతో పాటు చెన్నైకి చెందిన సుందర్ పిచై కూడా సిఇవో పదవికి రేసులో ఉన్నారు. అయితే, సత్య నాదెళ్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు అమెరికా మీడియా అభిప్రాయపడుతోంది.
మైక్రోసాఫ్ట్ సీఈఓ రేసులో భారత సంతతికి చెందిన సుందర్ పిచై కూడా ఉన్నట్లు ప్రముఖ మీడియా వెబ్‌సైట్ ‘సిలికాన్ యాంగిల్' పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి సంబంధించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 42 సంవత్సరాల సుందర్ పిచై గూగుల్ కంపెనీలో 2004లో చేరారు. ప్రసుత్తం ఆండ్రాయిడ్, క్రోమ్ యాప్స్ విభాగాలకు పిచై సీనియర్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సందుర్ పిచై టెక్నాలజీ విద్యలో పట్టభద్రులయ్యారు.

ఆ తరువాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ నియామకానికి సంబంధించి గత 5 నెలలగా కసరత్తులు జరుగుతున్న విషయం తెలుసిందే. సత్య నాదెళ్ల సిఇవోగా ఎంపికైతే మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల చరిత్రలో నిలుస్తారు. ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌండ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వెస్‌ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ తాను రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఈ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. వారిలో స్కైప్ మాజీ సిఇవో, మైక్రోసాఫ్ట్ స్ట్రేటజీ హెడ్ టోనీ బేట్స్ ఉన్నారు. స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ 2011లో సొంతం చేసుకుంది. సిఇవో రేసులో మరొకరు నోకియా మాజీ హెడ్ స్టీఫెన్ ఎలోప్ అని చెబుతున్నారు. నోకియాను మైక్రోసాఫ్ట్ 2013లో స్వాధీనం చేసుకుంది.


Click it and Unblock the Notifications