ముంబై/న్యూఢిల్లీ: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. మార్కెట్లలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ స్పందనతో గత కొన్ని రోజులుగా కొనసాగిన ర్యాలీకి తెరపడింది. దీపావళి రోజున జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో కీలక సూచికలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్ అండ్ పి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ రెండూ చారిత్రక గరిష్ఠ స్థాయిలు నమోదు చేశాయి.
కాగా ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ ఖాతా లోటు (సిఎడి) 70 బిలియన్ డాలర్లుగా ఉంటుందని గతంలో వేసిన అంచనాను తగ్గిస్తూ 60 బిలియన్ డాలర్లలోపే ఉంటుందని మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యక్తం చేసిన విశ్వాసాన్నీ మదుపర్లు పట్టించుకోలేదు. మూరత్ ట్రేడింగ్ తర్వాత ఒక రోజు విరామం అనంతరం మంగళవారం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి లాభాల స్వీకరణ జోరుగా సాగింది.

మదుపర్లు మంగళవారం నాడు అమ్మకాల వైపు దృష్టి మరల్చారు. ఫలితంగా ఉదయం ప్రారంభ సెషన్ నుంచి ముగింపుదాకా మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. దీంతో బిఎస్ఇ సూచీ సెన్సెక్స్ 264.57 పాయింట్లు కోల్పోయి 20,974.79 పాయింట్ల వద్దకు, ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 64.20 పాయింట్లు దిగజారి 6,253.15 పాయింట్ల వద్దకు పడిపోయాయి.
భారత్‌లోనే హార్లే డేవిడ్‌సన్ బైక్‌ల ఉత్పత్తి
అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్ బైక్‌ల ఉత్పత్తి కంపెనీ భారత్‌లోనూ తన మోటార్ బైకులను తయారు చేయనుంది. ఇందుకోసం దేశంలో ఒక నిర్మాణ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఇక్కడ పూర్తిస్థాయిలో బైకులను రూపొందించడమే కాకుండా యూరప్, ఆగ్రేయాసియాలకు ఎగుమతి చేయనుంది.

భారత విపణిలో యువత నుంచి లభిస్తున్న ఆదరణ కారణంగా ఇక్కడ ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని స్ట్రీట్ మోడళ్ల తయారీకి వినియోగించుకోనున్నామని హ్లార్లే డేవిడ్ సన్ మోటార్ అధ్యక్షుడు, సిఓఓ మ్యాథ్యూ లెవాటిచ్ మీడియాకు తెలిపారు. మంగళవారం ఇటలీలోని మిలాన్‌లో తమ కొత్త మోడల్ మోటార్ సైకిళ్లు స్ట్రీట్ 750, స్ట్రీట్ 500ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత 14 ఏళ్లలో పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై హార్లే డేవిడ్‌సన్ బైక్‌లను మార్కెట్లోకి తీసుకురావటం ఇదే మొదటి సారని తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి ఈ రెండు బైకుల ఉత్పత్తి కార్యకలాపాలు ఇండియాలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దేశీయ మార్కెట్ అవసరాల కోసం 2011 మొదట్లో హార్లే డేవిడ్‌సన్ ఇండియాలో అసెంబ్లింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు దిగుమతి చేసుకున్న విడి భాగాలను హర్యానాలోని బవల్‌లో ఉన్న యూనిట్‌లో అసెంబుల్ చేసి విక్రయిస్తున్నారు.


Click it and Unblock the Notifications