
సోమవారం సెన్సెక్స్ 293 పాయింట్ల లాభంతో 19977.38 పాయింట్ల వద్ద ప్రారంభమై ఆ తర్వాత 20086.43 పాయింట్ల వరకు దూసుకుపోయింది. కానీ ద్రవ్యోల్బణ గణాంకాల వెలువడడంతో సెన్సెక్స్ కేవలం 9.71 పాయింట్ల లాభంతో 19742.47 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రభుత్వ డెట్ బాండ్లలోకి విదేశీ పెట్టుబడిదారులను అనుమతించే నిబంధనలను స్టాక్ ఎక్సేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) మరింత సులభతరం చేయనుందన్న వార్తలు ప్రారంభంలో మార్కెట్‌కు లాభాలను పెరిగే విధంగా చేశాయి. దీంతో బ్యాంకు, హెల్త్‌కేర్, రియల్టీ షేర్లు లాభపడగా ఐటి స్టాక్‌లు నష్టాల్లో ముగిసాయి.
బిఎస్ఈ సూచిల్లో బ్యాంకు షేర్లకు లాభాలు పొందగా..ఆరోగ్య సంరక్షణ, స్థిరాస్థి, ఐటీ సూచీలు నష్టాల పాలయ్యాయి. సెన్సెక్స్ వృద్ధిలో ప్రధానంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐటిసి స్టాక్‌లు నిలిచాయి. మరోవైపు ఎన్ఎస్ఇ సూచీ నిఫ్టీ 10.05 పాయింట్ల నష్టంతో 5840.55 పాయింట్ల వద్ద ముగిసింది. యుఎస్ఎఫ్‌డిఎ ఆంక్షలతో రాన్‌బ్యాక్సీ షేరు ఏకంగా 30 శాతం మేర నష్టపోయి 318.85 రూపాయల వద్ద ముగిసింది.
ద్రవ్యోల్బణాన్ని పెంచిన ఉల్లి
సామాన్య ప్రజలకేగాక ప్రభుత్వాన్ని వణికించిన ఉల్లి ధర ఇప్పుడు ద్రవ్యోల్బణం మరింత పెరిగేందుకు కారణమైంది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 6.1శాతానికి చేరింది. వరుసగా మూడో నెలలోనూ పెరిగి ఇది ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గత నెలలో టోకు ధరల ఆధారితంగా లెక్కించే ద్రవ్యోల్బణం 5.79 శాతంగా ఉంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం దృడపడి ఆర్ బిఐ కొత్త గవర్నర్ రఘురాం రాజన్ కు సవాల్ గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్ బిఐ సెప్టెంబర్ 20న ద్రవ్య పరపతి విధాన సమీక్షిస్తానన్న నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచే సాహసం చేయొద్దని పారిశ్రామిక వర్గాలు ఒత్తిడి పెంచుతున్నాయి.
వార్షిక ప్రాతిపదికన ఆగస్టులో ఉల్లి ధరలు 244.62 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 77.81 శాతం, పండ్ల ధరలు 8.17 శాతం పెరిగాయి. కాగా బంగాళ దుంప ధరలు మాత్రం 15 శాతం, పప్పుల ధరలు 14 శాతం మేర తగ్గడం వినియోగదారులకు కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు. చక్కెర, వంట నూనెల ధరలు కూడా వరుసగా 4.2 శాతం, 3.86 శాతం మేర తగ్గాయి. మొత్తం తయారైన ఉత్పత్తుల ధరల్లో 1.9 శాతం పెరుగుదల నమోదైంది.
నెల గరిష్టానికి రూపాయి
విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు సెబి నిబంధనలు సులభతరం చేయనుందన్న వార్తలతో సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ నెల రోజుల గరిష్ఠ స్థాయికి చేరింది. డాలర్ మారకంలో రూపాయి 65 పైసలు లాభంతో 62.83 వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు మార్కెట్లోకి భారీగా వస్తాయన్న అంచనాలతో బ్యాంకర్లు, ఎగుమతిదారులు తమ డాలర్ పొజిషన్లను తగ్గించుకోవటం ద్వారా రూపాయి లాభపడటానికి కారకులయ్యారు. ఆగస్టు 16న రూ.61.65 వద్ద ముగిసిన తర్వాత మళ్లీ రూపాయి మారకం విలువ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.


Click it and Unblock the Notifications