రీమ్యాప్‌కు స్కిల్ ఛాంపియన్ అవార్డు
ముంబై: ఆంధ్రప్రదేశ్ రాజీవ్ విద్యా, ఉపాధి శిక్షణా సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, జాతీయ నైపుణ్యాభివృధ్ది సంస్థల సహకారంతో సెప్టెంబర్ 4న ఫిక్కి గ్లోబల్ స్కిల్ సమ్మిట్ చేపట్టిన కార్యక్రమంలో రెండవ ఫిక్కి లీప్ వాల్ట్ స్కిల్ ఛాంపియన్ అవార్డ్ ను అందుకుంది ఆంధ్రప్రదేశ్ రాజీవ్ విద్యా, ఉపాధి శిక్షణా సంస్థ(రీమ్యాప్).
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోటీ పడి ఆంధ్రప్రదేశ్ రాజీవ్ విద్యా, ఉపాధి శిక్షణా సంస్థ ఈ అవార్డును సొంతం చేసుకుంది. గుజరాత్, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలను పక్కకు నెట్టి రీమ్యాప్ ఈ ఘనతను సాధించింది.

రాజీవ్ యువ కిరణాల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చినందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును రీమ్యాప్ కు ప్రకటించింది. ఛైర్మన్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి ఆధ్వర్యంలో రీమ్యాప్ రాజీవ్ యువ కిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్లంరాజు చేతుల మీదుగా రీమ్యాప్ తరపున ఐఏఎస్ అధికారి, రీమ్యాప్ మిషన్ డైరెక్టర్ సోమేష్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు.
సోమేష్ కుమార్.. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్టీల కోసం రూ. 60కోట్ల ఖర్చుతో 20 యువజన ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2012లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది.
దేశంలో నైపుణ్యం గల యువతను తయారు చేసేందుకు కృషి చేస్తున్న సంస్థలకు ఫిక్కి ఈ అవార్డులను అందించి ప్రోత్సహిస్తోంది. 2022వరకు దేశంలో 500మిలియన్ల నైపుణ్యం గల యువతను తయారు చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.


Click it and Unblock the Notifications