ఎంఎస్ఎంఈల కోసం భారీ నిధి, ఇటీవలే గోల్డ్ లోన్ ప్రారంభం: ఎస్బీఐ చైర్మన్
కరోనా నేపథ్యంలో రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.50,000 కోట్ల మూలధన సాయం అందించేందుకు ప్రకటించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. దీంతో ఆయా దేశాలు ప్యాకేజీలు ప్రకటించాయి. మోడీ ప్రభుత్వం కూడా జీడీపీలో 10 శాతాని కంటే ఎక్కువ ప్యాకేజీని ప్రకటించింది.

ఎంఎస్ఎంఈలకు అండగా ఉండేందుకు..
తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ.10,000 కోట్ల పరిమాణం గల ఫండ్ ఆఫ్ ఫండ్స్ త్వరలో అందుబాటులోకి వస్తోందన్నారు. నిధుల కొరత, తక్కువ ఆదాయాలతో సతమతమవుతున్న కంపెనీలకు అండగా నిలవడమే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉద్దేశ్యమని తెలిపారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో మాట్లాడారు. ఎంఎస్ఎంఈలకు లిక్విడిటీ సాయం అందించేందుకు బ్యాంకులు ఇప్పటికే అత్యవసర రుణ సదుపాయాన్ని అందిస్తున్నాయని, ఈ కొత్త ఫండ్ వారికి మరింత ఊరటను ఇస్తుందన్నారు.

పసిడి పథకం..
ఓ ప్రధాన నిధి, కొన్ని అనుబంధ నిధుల ఆధారంగా ఈ స్కీం అమలు అవతుందని రజనీష్ చెప్పారు. ఎంఎస్ఎంఈల కోసం ఇటీవల ఓ పసిడి పథకాన్ని కూడా ప్రారంభించామన్నారు. ఈ పథకం కింద ఒక్క నెలలోనే రూ.88 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. మీరు లాకర్‌కు కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రుణాలపై హామీ ద్వారా ప్రభుత్వం కూడా ధీమా కల్పించిందన్నారు.

ఫండ్ ఆఫ్ ఫండ్స్
ఎంఎస్ఎంఈలకు తమ వ్యాపార పరిమాణాన్ని, సామర్థ్యం పెంచుకునేందుకు, స్టాక్ ఎక్స్చేంజీల్లో ప్రధాన ప్లాట్‌ఫాంపై నమోదయ్యేలా ప్రోత్సహించేందుకు ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (FOF) నిధి ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మే నెలలో చెప్పారు. ప్రొఫెషనల్ కార్పోరేషన్లు లేదా వెంచర్ కేపిటలిస్టుల సహకారం ద్వారా నిధులు సేకరించే అవకాశం లేని వారికి ప్రారంభ దశలో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ప్రయోజనకరమని నిర్మల తెలిపారు.


Click it and Unblock the Notifications