5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం కష్టమే, ఇలా అసాధ్యమేమీ కాదు: మోడీ కలపై గడ్కరీ
2024 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గత ఏడాది (2019) ఆర్థిక మందగమనం కారణంగా వివిధ రంగాలు కుప్పకూలాయి. జీడీపీ కూడా మొదటి క్వార్టర్‌లో 5 శాతానికి, రెండో క్వార్టర్‌లో 4.5 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో మోడీ కల 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక నిపుణులు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దీనిపై మాట్లాడారు.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కష్టమే కానీ
2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని తాము పెట్టుకున్న లక్ష్యం కష్టమేనని, అయినా ఇది అసాధ్యం మాత్రం కాదని నితిన్ గడ్కరీ అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై తక్కువగా ఆధారపడటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చునని చెప్పారు.

అసాధ్యం కాదు
ఏ లక్ష్యాన్ని అయినా సాధించాలని అంటే బలమైన రాజకీయ సంకల్పం ఉండాలని గడ్కరీ చెప్పారు. ఆ సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ ప్రధాని మోడీ మనకు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను టార్గెట్‌గా నిర్దేశించారని తెలిపారు. ఆ లక్ష్యం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేశారు.

ఇలా సాధ్యమే
మన దేశానికి ఎన్నో వనరులు ఉన్నాయని, ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉందని, వాటిని పక్కన పెట్టి మనం ఏటా వేలకోట్లను మందులు, వైద్య పరికరాలు, బొగ్గు, రాగి వంటి దిగుమతులపై ఖర్చు చేస్తున్నామన్నారు. అలా కాకుండా దిగుమతులను తగ్గించుకొని దేశీయంగా ఉత్పత్తి పెంచుకుంటే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోగలమన్నారు.

ఆర్థిక మందగమనంపై...
ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని గడ్కరీ చెప్పారు. ఒక్కోసారి సవాళ్లు తప్పవన్నారు. ఇందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదా డిమాండ్-సప్లై.. ఏదైనా కారణం కావొచ్చునన్నారు. ఇబ్బందులను, సవాళ్లను నేటి యువతరం అవకాశాలుగా మలుచుకొని భారత్‌ను వృద్ధి పథాన నడిపిస్తుందన్నారు.


Click it and Unblock the Notifications