కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రూ.3 లక్షల కోట్లకు పైగా క్రెడిట్ గ్యారంటీ స్కీంను ప్రకటించిన విషయం తెలిసిందే. వివిధ బ్యాంకులు జూన్ 20వ తేదీ వరకు 19 లక్షల ఎంఎస్ఎంఈలకు, ఇతర వ్యాపారస్తులకు రూ.79,000 కోట్ల రుణాలు అందించాయి. ఈ మేరకు మంగళవారం ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పటికే ఉన్న రుణాలలో 20 శాతం ఇస్తాయి.

రూ.35,000 కోట్లు పంపిణీ
ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం కల్పించుకుందని, ప్రభుత్వ హామీతో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద బ్యాంకులు 20 జూన్ 2020 నాటికి రూ.79,000 కోట్ల రుణాలను మంజూరు చేశాయని, ఇందులో రూ.35,000 కోట్లు పంపిణీ అయిందని ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటివి ఉన్నాయి. 19 లక్షలమంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ
అలాగే మార్చి-ఏప్రిల్ నెలల్లో ప్రకటించిన ఆర్బీఐ స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద ఎన్బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు.. ఎంఎస్ఎంఈలు, చిన్న సంస్థలకు రూ.10,220 కోట్లు శాంక్షన్ చేసినట్లు తెలిపింది. నేషనల్ హౌసింగ్ బ్యాంకు (NHB) రూ.10,000 కోట్లు కంపెనీలకు మంజూరు చేసినట్లు పేర్కొంది. మరిన్ని నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.

తమిళనాడు, మహారాష్ట్ర టాప్ 2లో..
రూ.75,000 కోట్ల ప్రకటన వరకు (జూన్ 20 కంటే కొద్ది రోజుల ముందు) ఎక్కువగా తమిళనాడు బిజినెస్ యూనిట్లకు వెళ్లాయి. తమిళనాడు వ్యాపారులకు రూ.2,626 కోట్లు పంపిణీ చేశాయి బ్యాంకులు. ఆ తర్వాత మహారాష్ట్ర బిజినెస్ యూనిట్లకు రూ.1883 కోట్లు పంపిణీ చేశాయి. ఇందులో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.16,234 కోట్లు మంజూరు చేసి, రూ.10,960 కోట్లు పంపిణీ చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5,666 కోట్లు మంజూరు చేసి, రూ.1719 కోట్లు పంపిణీ చేసింది. కెనరా బ్యాంకు రూ.4,171 కోట్లు మంజూరు చేసి, రూ.2,132 కోట్లు పంపిణీ చేసింది.


Click it and Unblock the Notifications