రీస్టార్ట్ ప్యాకేజీ, వారి ఖాతాల్లోకి రూ.512 కోట్లు: మీవీ కొంటాం.. గుడ్‌న్యూస్ చెప్పిన జగన్
అమరావతి: కరోనా మహమ్మారి సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(MSME) ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని గతంలో ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి రెండో విడత బకాయిలు రూ.512 కోట్లను సోమవారం విడుదల చేసింది. రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా రూ.512 కోట్లు విడుదల చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

వారి ఖాతాల్లోకి రూ.512 కోట్లు
సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి రీస్టార్ట్ ప్యాకేజీని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాలలో ఇందుకు సంబంధించిన మొత్తం జమ అయ్యాయి. మరోవైపు స్పిన్నింగ్ మిల్లులకు సంబంధించి ప్రోత్సాహక బకాయిలు రూ.1,000 కోట్లను వచ్చే ఏడాది చెల్లిస్తామని జగన్ చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ఏటా ఒక రంగానికి సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రుణాలు తీసుకోవచ్చు.. 6 నెలలు మారటోరియం
గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రూ.827 కోట్లకు పైగా బకాయిలు ఇవ్వలేదని, వాటిని తాము చెల్లిస్తున్నామని జగన్ చెప్పారు. మొత్తం పరిశ్రమలకు నాటి ప్రభుత్వం రూ.4వేల కోట్లు బకాయిలు పెట్టిందన్నారు. పారిశ్రామిక రంగానికి తాము చేయూతనిస్తున్నామన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిశ్రమలకు వెసులుబాటు కోసం విద్యుత్ స్థిరచార్జీలు రూ.188 కోట్లు మాఫీ చేశామని, ఎంఎస్ఎంఈలకు ఎన్ఎఫ్‌సీ ద్వారా రూ.200 కోట్ల వరకు 6 శాతం నుండి 8 శాతం వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ రుణాలపై ఆరు నెలలు మారటోరియం ఉంటుందని, మూడేళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.

ఎంఎస్ఎంఈలకు అండగా.. జగన్ గుడ్ న్యూస్
ప్రభుత్వ విభాగాలకు అవసరమైన 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో 25 శాతం ఎంఎస్ఎంఈల నుండి కొనుగోలు చేసి 45 రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పరిశ్రమల నుండి 4 శాతం, మహిళా పారిశ్రామికవేత్తల యూనిట్ల నుండి 3 శాతం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని ఎంఎస్ఎంఈలకు గుడ్ న్యూస్ చెప్పారు.

98వేల ఎంఎస్ఎంఈల్లో 10 లక్షలమందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 98వేల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని జగన్ ట్వీట్ చేశారు. ఇందులో 10 లక్షలమంది వరకు ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ రూ.1.168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించామన్నారు. మరోవైపు, కరోనా నుండి రక్షణకు ఏపీ మెడ్‌టెక్ జోన్ తయారు చేసిన పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు, పరీక్షలకు ఉపయోగించే ఇతర ఉపకరణాలను జగన్ ఆవిష్కరించారు.


Click it and Unblock the Notifications