రూ. 22 కోట్ల లాభం చూపించి రూ. 2.2 కోట్లు కొట్టేశారు.. స్టాక్ ట్రేడింగ్ పేరుతో నట్టేట మునిగిన ప్రైవేట్ ఉద్యోగి.
Telegram Stock Scam: హైదరాబాద్‌లోని కాప్రా, సాకేత్ కాలనీకి చెందిన 55 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ. 2.2 కోట్లు కోల్పోయారు. ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, భారీ లాభాల పేరిట సాగిన ఈ హైటెక్ దోపిడీపై బాధితుడి ఫిర్యాదు మేరకు మల్కాజ్‌గిరి సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
జూన్ 15న బాధితుడిని అతని ప్రమేయం లేకుండానే ఫ్యూచర్ టుమారో 2061 అనే టెలిగ్రామ్ గ్రూప్‌లో చేర్చడంతో ఈ కథనం మొదలైంది. ఆ గ్రూప్‌లో 'అనితా' అనే మహిళ ఒక ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుంది. తమ వద్ద ఉన్న ప్రత్యేక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్వల్పకాలంలోనే భారీ రాబడులు పొందే అవకాశముందని నమ్మబలికింది. ఆ మాటలను ప్రామాణికమైనవిగా నమ్మిన బాధితుడు జూన్ 16న ప్రాథమికంగా రూ. 10,000.. ఆ తర్వాత జూలై 6న మరో రూ. 1 లక్షను మోసగాళ్లు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు.

బాధితుడి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడి తంత్రాలను ఉపయోగించారు. అతడిని ఒక 'వీఐపీ ట్రేడింగ్ గ్రూప్'లోకి మార్చి, మరో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం 'ఫిన్* ఇన్వెస్ట్‌మెంట్' అనే పేరుగల నకిలీ యాప్ ద్వారా ఐపీఓ (IPO) పెట్టుబడుల్లో పాల్గొనాలని ప్రోత్సహించారు. అతడు పెట్టిన పెట్టుబడులకు భారీగా లాభాలు వస్తున్నట్లు భ్రమ కల్పించేందుకు. మోసగాళ్లు ఆ యాప్ స్క్రీన్‌పై ఏకంగా రూ. 22 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు తారుమారు చేసిన గణాంకాలను చూపిస్తూ నమ్మించారు.
స్క్రీన్‌పై కనిపిస్తున్న రూ. 22 కోట్ల భారీ లాభాల నుంచి కనీసం రూ. 1.5 కోట్లు విత్‌డ్రా చేసుకోవడానికి బాధితుడు ప్రయత్నించడంతో అసలు మోసం బయటపడింది. అతని ప్రొఫైల్‌పై 'రిస్క్ ఫ్లాగ్' వచ్చిందని కట్టుకథలు చెబుతూ ఆ లావాదేవీని మోసగాళ్లు అడ్డుకున్నారు. ఖాతాను మళ్లీ పునరుద్ధరించాలంటే అదనంగా రూ. 1.5 కోట్లు డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టారు. వారి కపట మాటలు నిజమేనని భావించిన బాధితుడు మరో రూ. 1 కోటి బదిలీ చేశారు. ఇలా జూన్ 15 నుంచి ఆగస్టు 27 మధ్య వివిధ దఫాలుగా బాధితుడు తన చేతిచమురు వదిలించుకుంటూ మొత్తం రూ. 2.2 కోట్లను నేరగాళ్ల ఖాతాల్లోకి జమ చేశారు. ఆ తర్వాత కూడా విత్‌డ్రా కాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
బాధితుడి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద క్రిమినల్ నమ్మకద్రోహం, మోసం, ఫోర్జరీ, ఐటీ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరస్తులు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, టెలిగ్రామ్ ఐడీలను రికవరీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో వచ్చే అపరిచిత ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లను నమ్మవద్దని, అనధికారిక ట్రేడింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications
