ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చిన APL Apollo Tubes.. మెగా ఒప్పందం తర్వాత కుప్పకూలిన షేర్లు.. ఎందుకంటే..
Stock Market Today: టాటా స్టీల్ (Tata Steel)తో కుదిరిన మెగా ఒప్పందం నేపథ్యంలో పలు ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు రేటింగ్‌లను తగ్గించి, టార్గెట్ ధరలను భారీగా కోత పెట్టడంతో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ (APL Apollo Tubes) షేర్లు బుధవారం (నవంబర్ 25, 2026) తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ (BSE)లో ఉదయం రూ. 1,501.35 ఇంట్రాడే గరిష్ఠం వద్ద ప్రారంభమైన ఈ షేరు, 15 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకి కొత్త 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 1,334.55 కు పడిపోయింది. నవంబర్ 16, సోమవారం నాడు 52 వారాల గరిష్ఠాన్ని తాకిన ఈ స్టాక్.. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే 34 శాతానికి పైగా విలువను కోల్పోవడం గమనార్హం.
ప్రతిపాదిత లావాదేవీ ప్రకారం టాటా స్టీల్ సంస్థ ఏపీఎల్ అపోలో ప్రమోటర్ల 26.38 శాతం వాటాను ఒక్కో షేరుకు సుమారు రూ. 2,100 చొప్పున కొనుగోలు చేయడంతో పాటు.. అదనంగా 26 శాతం వాటా కోసం ఒక్కో షేరుకు రూ. 2,300 (లేదా రూ. 2,301) చొప్పున ఓపెన్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. దీనికి ప్రతిగా ఏపీఎల్ అపోలో సుమారు రూ. 28,000 కోట్లకు టాటా స్టీల్ యొక్క ట్యూబ్స్, కలర్-కోటెడ్ స్టీల్ వ్యాపారాలను కొనుగోలు చేస్తుంది. ఈ కొనుగోలుకు తొలుత రుణం ద్వారా.. ఆ తర్వాత సుమారు రూ. 18,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడి ద్వారా నిధులు సమకూరుతాయి. అలాగే సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల (MTPA) కలర్-కోటింగ్ సామర్థ్యాన్ని ఎస్జీ స్పెక్ట్రా (SG Spectra)కు అవుట్‌సోర్స్ చేయనుంది.

అయితే ఈ డీల్‌లోని అధిక ఖర్చు, రుణ భారం, వడ్డీ వ్యయాలపై నువామా (Nuvama), యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. నువామా ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఈ స్టాక్ రేటింగ్‌ను 'హోల్డ్'కు తగ్గించి, ఫెయిర్ వాల్యూను రూ. 1,459 గా, స్వల్పకాలిక టార్గెట్ ధరను రూ. 1,739 గా నిర్దేశించింది. పూర్వ ప్రమోటర్ సంజయ్ గుప్తా నిష్క్రమణ, స్వల్పకాలిక ఈపీఎస్ (EPS) తగ్గుదల కారణంగా చారిత్రక సగటు కంటే 40 శాతం తక్కువగా 15 రెట్లు EV/EBITDA వాల్యుయేషన్‌ను కేటాయించింది. యాక్సిస్ క్యాపిటల్ తన సిఫార్సును 'బై' నుండి 'సెల్' (Sell) కు తగ్గిస్తూ టార్గెట్ ధరను 40 శాతం కోత పెట్టి రూ. 2,400 నుండి రూ. 1,420 కి కుదించింది. రూ.28,000 కోట్ల కొనుగోలు విలువ FY26 EV/EBITDA కి 24.8 రెట్లుగా ఉండి చాలా ఖరీదైనదని.. అధిక వడ్డీ భారం వల్ల FY28 ఈపీఎస్ 52 శాతం పడిపోయి రూ.28కి చేరవచ్చని అంచనా వేసింది.
మరోవైపు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సైతం ఏపీఎల్ అపోలో రేటింగ్‌ను 'యాడ్' నుండి 'సెల్' (Sell) కు మార్చి, టార్గెట్ ధరను రూ. 2,200 నుండి ఏకంగా రూ. 1,345 కి తగ్గించింది. రుణ ఆధారిత కొనుగోలు వల్ల తలెత్తే ఈక్విటీ డైల్యూషన్, అధిక లెవరేజ్, మైనారిటీ వాటాదారులపై ప్రభావం లాభదాయకతను దెబ్బతీస్తాయని హెచ్చరించింది. సాంకేతిక విశ్లేషణ పరంగా సాహీ (SAHI) రీసెర్చ్ హెడ్ గౌరవ్ అరోరా మాట్లాడుతూ.. అధిక వాల్యూమ్‌లతో కూడిన ఈ పతనం స్టాక్‌లో బలమైన బ్రేక్‌డౌన్‌ను సూచిస్తోందని.. వీక్లీ ఆర్‌ఎస్‌ఐ (RSI) ఓవర్‌సోల్డ్ జోన్ వైపు కదులుతున్నందున స్వల్పకాలంలో కొంత స్థిరీకరణ కనిపించినా, స్టాక్‌కు రూ. 1,275 వద్ద కీలక మద్దతు ఉందని పేర్కొన్నారు.
మరోవైపు టాటా స్టీల్ విషయంలోనూ బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన అంచనాలను వెలువరించాయి. ఏపీఎల్ అపోలోలో 52 శాతం వాటా కొనుగోలు కోసం చెల్లిస్తున్న ధర ఖరీదైనదని, ఈ విలీనం వల్ల టాటా స్టీల్ మొత్తం అప్పు 33 శాతం పెరిగి రూ. 1.22 లక్షల కోట్లకు (నికర అప్పు-ఎబిటా 2.5 రెట్లకు) చేరవచ్చని యాక్సిస్ క్యాపిటల్ విశ్లేషిస్తూ 'రెడ్యూస్' రేటింగ్‌తో టార్గెట్ ధరను రూ. 175 నుండి రూ. 170కి తగ్గించింది.
జేపీ మోర్గాన్ సైతం తటస్థ వైఖరితో టార్గెట్ ధరను రూ. 200 నుండి రూ. 179కి కుదిస్తూ, ఏపీఎల్ అపోలో రుణ భారాన్ని 2.5 రెట్లకు తగ్గించడానికి రాబోయే 12 నెలల్లో టాటా స్టీల్ సుమారు రూ. 18,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని అంచనా వేసింది. గోల్డ్‌మన్ సాక్స్ తటస్థ అభిప్రాయంతో రూ. 215 టార్గెట్ ధరను నిర్దేశించింది.
అయితే దీర్ఘకాలంలో ఈ ఒప్పందం టాటా స్టీల్ డౌన్‌స్ట్రీమ్ వ్యాపారాన్ని బలోపేతం చేస్తుందని కొన్ని బ్రోకరేజీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. జెఫరీస్ 'బై' రేటింగ్‌తో రూ. 240, మాక్వారీ 'అవుట్‌పెర్ఫార్మ్' రేటింగ్‌తో రూ. 241, సీఎల్‌ఎస్‌ఏ (CLSA)రూ. 225 టార్గెట్ ధరలను ఇచ్చాయి. ఈ ఒప్పందంతో రెండు కంపెనీల సంయుక్త ట్యూబ్స్, కోటెడ్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 7.5 మిలియన్ టన్నులకు (3-5 ఏళ్లలో 15.5 మిలియన్ టన్నులకు) చేరుతుందని.. 3 నుండి 4 సంవత్సరాలలోపు విలీన వ్యాపారం టాటా స్టీల్ ఒక్కో షేరు ఆదాయాన్ని పెంచే స్థాయికి చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
