దారుణంగా పడిపోయిన ఇన్వెస్టర్ల ఫేవరెట్ కంపెనీ షేర్లు.. రూ.348 కోట్ల ప్రాజెక్టు వచ్చినా నో యూజ్..
RVNL Shares Fall Nearly 50% in 2026: ఒకప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ మదుపర్ల అభిమాన షేర్‌గా వెలుగొందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) షేర్లు.. ప్రస్తుతం తీవ్ర అమ్మకాల ఒత్తిడితో భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. సోమవారం (నవంబర్ 23, 2026) ట్రేడింగ్‌లో ఆర్‌విఎన్‌ఎల్ షేరు తన మునుపటి ముగింపు ధర రూ. 191 నుండి రూ. 195 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల సెగతో రూ. 186 స్థాయికి జారుకుంది.
ఒకప్పుడు రూ. 647 గరిష్ఠ స్థాయిని తాకిన ఈ షేరు, ప్రస్తుతం రూ. 190 దిగువకు పడిపోవడంతో తన గరిష్ఠ ధర నుండి సుమారు 70 శాతం, కేవలం ఏడాది కాలంలోనే దాదాపు 41 శాతం మేర విలువ కోల్పోయింది. దీంతో గరిష్ఠ స్థాయిల వద్ద కొనుగోలు చేసిన మదుపర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) సలీం అహ్మద్ సిఎన్‌బిసి ఆవాజ్ (CNBC Awaaz)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో షేరు పతనం.. వ్యాపార స్థితిగతులు, ఆర్డర్ బుక్, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతనిచ్చారు.

షేరు ధర ఇంతగా పడిపోవడంపై మదుపర్లలో నెలకొన్న ఆందోళనలపై స్పందించిన సలీం అహ్మద్.. రోజువారీ షేరు ధరను కంపెనీ యాజమాన్యం నేరుగా నియంత్రించదని, వివిధ మార్కెట్ కారణాల వల్ల ధరలలో హెచ్చుతగ్గులు సహజమని పేర్కొన్నారు. ప్రాజెక్టులను సమయానికి పూర్తి చేయడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపడం, మదుపర్లకు మెరుగైన రాబడులను అందించడమే యాజమాన్యం ప్రధాన బాధ్యత అని, నిర్ధారిత విధానం ప్రకారం డివిడెండ్ల చెల్లింపు కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఆర్‌విఎన్‌ఎల్ వార్షిక ఆదాయం సుమారు రూ. 20,000 నుండి రూ. 22,000 కోట్ల మధ్య ఉందని.. రాబోయే కాలంలో 10 శాతం ఆదాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రెండో త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే ఆదాయం సుమారు 8.25 శాతం తగ్గినప్పటికీ.. ఆపరేటింగ్ మార్జిన్లు మాత్రం 4.3 శాతం నుండి 5.6 శాతానికి మెరుగుపడ్డాయని తెలిపారు. ముడి పదార్థాల ధరల హెచ్చుతగ్గుల భారాన్ని తగ్గించేలా కొన్ని ఒప్పందాలలో ప్రైస్ వేరియేషన్ నిబంధనలు ఉన్నాయని.. అయితే ముడిసరుకుల లభ్యతలో జాప్యం వల్ల కొన్ని ప్రాజెక్టుల వేగం నెమ్మదించిందని, సరఫరా స్థిరపడిన తర్వాత పనులు వేగవంతమవుతాయని ఆయన వివరించారు.
కంపెనీ ఆర్డర్ బుక్ ప్రస్తుతం రూ. 90,000 కోట్లకు పైగా ఉందని, ఇందులో భారత్‌నెట్, వందే భారత్ వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులు ఉన్నాయని సలీం అహ్మద్ తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి వచ్చిన సుమారు రూ. 350 కోట్ల టెండర్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌లలోని పలు ప్రాజెక్టులలో ఆర్‌విఎన్‌ఎల్ అత్యల్ప బిడ్డర్‌గా (L-1) నిలిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్‌విఎన్‌ఎల్ ఆర్డర్లలో సుమారు 63 శాతం రైల్వేల నుండే వస్తున్నాయని.. రాబోయే రెండుమూడేళ్లలో రైల్వేలపై ఆధారపడటాన్ని తగ్గించి 60 శాతం రైల్వేయేతర రంగాలు (మెట్రో, హైవేలు, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, టెలికాం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ), 40 శాతం రైల్వేల నుండి వచ్చేలా వ్యాపారాన్ని వైవిధ్యపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ప్రాజెక్టులను బట్టి మార్జిన్లు భిన్నంగా ఉంటాయని.. రైల్వే నిర్వహణకు 8-10 శాతం, బిడ్డింగ్ ప్రాజెక్టులకు 5-6 శాతం, ప్రభుత్వ/పీఎస్‌యూ పీఎంసీ (PMC) పనులకు సుమారు 7 శాతం మార్జిన్లు ఉంటాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం 4-5 శాతంగా ఉన్న విదేశీ వ్యాపార వాటాను భవిష్యత్తులో 15-20 శాతానికి పెంచేందుకు ఆఫ్రికా సహా పలు దేశాలలో చర్చలు జరుపుతున్నామని.. విదేశీ ప్రాజెక్టులపై 15-20 శాతం వరకు మార్జిన్లు లభించే అవకాశం ఉందని అహ్మద్ పేర్కొన్నారు.
ఇక కీలకమైన రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పురోగతిపై మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో సుమారు రూ. 2,500 కోట్ల విలువైన పనులను అప్పగించామని, కొన్ని ప్రభుత్వ, చట్టబద్ధమైన అనుమతులు రాగానే పనులు పూర్తి స్థాయిలో పుంజుకుంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు సుమారు 19.5 శాతం పనులు పూర్తయ్యాయని, మొదటి సెక్షన్ పరిధిలోని సుమారు 24 కిలోమీటర్ల మార్గం పట్టాలపై ఉందని సలీం అహ్మద్ వెల్లడించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
