SBIలో 12,000 ఉద్యోగాలు.. క్లరికల్, ఆఫీసర్ పోస్టుల్లో భారీ రిక్రూట్‌మెంట్..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ రీతిలో నెట్‌వర్క్ విస్తరణ మరియు ఉద్యోగ కల్పనకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆఫీసర్, క్లరికల్ కేడర్‌లలో కలిపి సుమారు 11,000 నుండి 12,000 మంది కొత్త సిబ్బందిని నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఎస్‌బిఐ చైర్మన్ సి.ఎస్. శెట్టి వెల్లడించారు.
పదవీ విరమణలు, కొత్త వ్యాపార అవసరాలకు అనుగుణంగా చివరికి ఈ సంఖ్య ముగింపు దశకు వచ్చేసరికి 12,000 దాటవచ్చని ఆయన అంచనా వేశారు. గత ఏడాది 1,500 మంది స్పెషలిస్ట్ ఐటీ అధికారులతో కలిపి మొత్తం 25,633 మందిని నియమించుకున్నామని.. ఈసారి ఐటీ విభాగంలో అంత పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. మార్చి నాటికి 2.45 లక్షలకు పైగా నిపుణులైన ఉద్యోగ బలగంతో ఎస్‌బిఐ దేశంలోనే అగ్రగామి ఉద్యోగ కల్పన సంస్థగా కొసాగేలా ప్రణాళికలు రూపొందించుకుంది.

బ్యాంకింగ్ సేవల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా హేతుబద్ధీకరణ విధానాలను అమలు చేస్తూనే.. నికరంగా ఏటా 200 నుండి 250 వరకు కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు శెట్టి తెలిపారు. సరికొత్తగా ఏర్పడుతున్న నివాస ప్రాంతాలు, వ్యాపారపరంగా అత్యంత చురుకుగా ఉన్న జిల్లాలలో బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఎస్‌బిఐ ఇప్పటికే మార్కెట్‌లో విస్తృతమైన నెట్‌వర్క్ కలిగి ఉన్నప్పటికీ, సరికొత్త ప్రాంతాల్లో కార్యకలాపాలు పెంచేందుకు ఇప్పటికీ మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మరో కీలకమైన మూలధన పరిణామంలో.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతిపాదించిన రూ. 30,000 కోట్ల రికార్డు స్థాయి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ఎస్‌బిఐ గ్రూప్ తన వాటాలో 1 శాతం వరకు ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. ఎస్‌బిఐ తన వద్ద ఉన్న 3.23 శాతం వాటాలో 0.65 శాతాన్ని, దాని అనుబంధ సంస్థ ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ తన వద్ద ఉన్న 4.33 శాతం వాటా నుండి 0.35 శాతాన్ని విక్రయించడానికి ప్రతిపాదించాయి. ఇటీవలే నిబంధనల ఆమోదం పొందిన ఈ భారీ ఐపీఓ, 2024లోని హ్యుందాయ్ మోటార్స్ (రూ. 27,858 కోట్లు) మరియు 2022 నాటి ఎల్‌ఐసీ (రూ. 20,557 కోట్లు) ఐపీఓలను అధిగమించి భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత పెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది.
ఇటీవల పారిస్ కేంద్రంగా పనిచేసే 'అముండి' భాగస్వామ్యంతో ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్‌లో 10 శాతం వాటాను ఉపసంహరించి రూ. 11,675 కోట్లను నగదీకరించిన ఎస్‌బిఐ, ఈ ఇష్యూ 41.66 రెట్ల రికార్డు సబ్‌స్క్రిప్షన్ పొందిందని గుర్తుచేసింది. ఈ విక్రయం తర్వాత ఫండ్ హౌస్‌లో ఎస్‌బిఐ వాటా 55.56 శాతానికి చేరింది. అయితే సమీప భవిష్యత్తులో మిగిలిన అనుబంధ సంస్థలలో ఎటువంటి నగదీకరణ లేదా వాటా విక్రయ ప్రణాళికలు లేవని చైర్మన్ సి.ఎస్. శెట్టి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications

