జీతం సరిపోవడం లేదు..కంపెనీ పెంచడం లేదు.. జాబ్ మారాల్సిందేనంటున్న ఉద్యోగులు..
Job Switch in 2027: భారతీయ కార్పొరేట్ శ్రామిక శక్తిలో తమ కెరీర్ ప్రాధాన్యతలకు సంబంధించి ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మెరుగైన వృద్ధి అవకాశాలు, జీతాల పెంపు, పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) ప్రధాన లక్ష్యాలుగా నిలుస్తుండటంతో.. మెజారిటీ భారతీయ నిపుణులు రాబోయే 2027 సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి సిద్ధమవుతున్నారు.
ప్రముఖ జాబ్ పోర్టల్ ఫౌండిట్ (foundit) నిర్వహించిన 'కెరీర్ రీసెట్ సర్వే 2027' ప్రకారం, దేశవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న 9,951 మంది నిపుణులలో ఏకంగా 68.4 శాతం మంది తమ ప్రస్తుత సంస్థలను వీడి కొత్త ఉద్యోగాల్లోకి మారాలని చురుకుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ప్రస్తుత నియామక మార్కెట్‌లో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ.. ఉద్యోగార్థులు తమ నైపుణ్యాలపై నమ్మకంతో కెరీర్ పురోగతి వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

ఈ సర్వే విశ్లేషణ ప్రకారం.. ఉద్యోగాలు మారడానికి 40.3 శాతం మంది నిపుణులు తమ ప్రాథమిక కారణంగా కెరీర్ వృద్ధి, కొత్త అవకాశాలను పేర్కొనగా, 29.7 శాతం మంది అధిక జీతాల కోసం కంపెనీలు మారాలని నిర్ణయించుకున్నారు. అలాగే 20.3 శాతం మంది మెరుగైన పని-జీవిత సమతుల్యత, సౌకర్యవంతమైన పని విధానం తమను ఉద్యోగం మారేలా ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే.. సర్వేలో పాల్గొన్న వారిలో 51.5 శాతం మంది నిపుణులు కనీసం 31 శాతం కంటే ఎక్కువ జీతం పెంపు (Hike) లభిస్తేనే కొత్త యజమానుల వద్దకు మారతామని స్పష్టం చేశారు.
ఇందులో 31.2 శాతం మంది 31 నుండి 50 శాతం జీతాల పెంపును ఆశించగా, 20.4 శాతం మంది ఏకంగా 50 శాతం కంటే ఎక్కువ జీతాల పెంపును డిమాండ్ చేస్తున్నారు. విశేషమేమిటంటే.. తమకు తగిన ప్రత్యామ్నాయ ఉద్యోగం దొరుకుతుందనే బలమైన విశ్వాసాన్ని 94.1 శాతం మంది అభ్యర్థులు వ్యక్తం చేశారు. కాగా, కేవలం 3.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత యజమానులతోనే కొనసాగాలని భావించగా, మరో 18.1 శాతం మంది ప్రస్తుత పాత్రల్లో ఉంటూనే కొత్త ఆఫర్ల కోసం వేచి చూస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మారుతున్న కార్యాలయ సంస్కృతి కూడా నిపుణుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. సర్వేలోని 82.1 శాతం మంది ప్రతివాదులు ఏఐని తమ ఉద్యోగాలకు ముప్పుగా కాకుండా ఒక గొప్ప అవకాశంగా పరిగణిస్తున్నారు. అందులో 67 శాతం మంది అభ్యర్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ ఏఐ నైపుణ్యాలను చురుకుగా పెంచుకుంటుండగా, 15.2 శాతం మంది ఇంకా శిక్షణ ప్రారంభించాల్సి ఉంది. అలాగే వర్కింగ్ విధానాల విషయానికి వస్తే.. 56 శాతం మంది హైబ్రిడ్ విధానానికే (Hybrid Work) మొగ్గు చూపగా, 23.7 శాతం మంది పూర్తిగా రిమోట్ ఉద్యోగాలను, 20.3 శాతం మంది ఆఫీస్ నుండి పనిచేసే విధానాన్ని కోరుకుంటున్నారు.
మరోవైపు నియామక ప్రక్రియలో (Recruitment) మారుతున్న సవాళ్లను కూడా ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఇంటర్వ్యూల తర్వాత రిక్రూటర్ల నుండి సరైన కమ్యూనికేషన్ లేకపోవడాన్ని 52.7 శాతం మంది తమ ప్రధాన అసంతృప్తిగా పేర్కొనగా, 19.1 శాతం మంది సుదీర్ఘ నియామక ప్రక్రియల పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఏఐ-ఆధారిత లేదా ఫీడ్‌బ్యాక్ లేని ఆటోమేటెడ్ తిరస్కరణలపై 9 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం మీద రాబోయే 2027 సంవత్సరంలో భారతీయ శ్రామిక శక్తి కేవలం అధిక ఆదాయాన్ని మాత్రమే కాకుండా, ఏఐ నైపుణ్యాలు, పని సౌలభ్యం, మెరుగైన జీవిత ప్రమాణాలను ఇచ్చే ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతుందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications
