నేటి నుండి RTGS కొత్త టైమింగ్స్! ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్
రూ.2 లక్షలకు మించి నగదు బదలీ చేసేందుకు ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(RTGS) సేవలు డిసెంబర్ 1, మంగళవారం (నేటి నుండి) రోజంతా అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు RTGS సేవలు వర్కింగ్ డేస్‌లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేవి. నెఫ్ట్, ఐఎంపీఎస్ ద్వారా రోజంతా ట్రాన్సాక్షన్స్ చేసే వెసులుబాటు ఉంది. కానీ గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే అకౌంట్ నుండి మరో అకౌంట్‌కు బదలీ చేయవచ్చు. వీటిని ఎక్కువగా రిటైల్ ఖాతాదారులు ఉపయోగిస్తారు. వ్యాపార సంస్థలు, రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తం ట్రాన్సాక్షన్ చేసేవారు RTGSను ఉపయోగిస్తారు.

ఆర్టీజీఎస్ 24X7
డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌ను ప్రోత్సహించేందుకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ మీద ఆర్బీఐ విధించే ఛార్జీలను గత ఏడాది జూలై నుండి రద్దు చేసింది. నేటి నుండి ఆర్టీజీఎస్ 24X7 అందుబాటులో ఉండటం రోజువారీ ట్రాన్సాక్షన్స్ చేసే వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరం. పెద్ద మొత్తంలో తక్షణమే బదలీ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా కనీస బదలీ రూ.2 లక్షలు కాగా, గరిష్ట పరిమితి లేదు. ఇప్పటి వరకు ఆర్టీజీఎస్ వల్ల ఉన్న ఇబ్బంది ఏమంటే కేవలం పని దినాల్లో, నిర్ణీత సమయంలో మాత్రమే ఉండటం. ఇప్పుడు రౌండ్ ది క్లాక్ పని చేయనుంది.

ఎంత ట్రాన్సుఫర్ చేస్తే ఎంత ఛార్జ్
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంకు బ్రాంచీని విజిట్ చేయడం ద్వారా ఆర్టీజీఎస్‌ను ఉపయోగించి మనీ ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ట్రాన్సుఫర్ పైన విధించే ఛార్జీలను ఆర్బీఐ రద్దు చేసినప్పటికీ, ఆయా బ్యాంకులు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తాయి. రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు ఫండ్ ట్రాన్సుఫర్ పైన బ్యాంకులు గరిష్టంగా రూ.24.50 వసూలు చేస్తాయి. రూ.5 లక్షలకు మించి ఫండ్ ట్రాన్సుఫర్ చేస్తే బ్యాంకులు గరిష్టంగా రూ.49.90 ఛార్జ్ చేస్తాయి. కస్టమర్లు దీనిపై జీఎస్టీ చెల్లించవలసి ఉంటుంది. విస్తృత చెల్లింపుల సౌలభ్యం కోసం రౌండ్ ది క్లాక్ ఆర్టీజీఎస్‌ను అందుబాటులో ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

రూ.2 లక్షలకు తక్కువ ఉంటే నెఫ్ట్
ఆర్టీజీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్సుఫర్ కోరుతూ నిధులు బదలీ చేయమని బ్యాంకు సూచనలు అందుకుంటుంది. దీంతో వెంటనే ఫండ్ ట్రాన్సుఫర్ అవుతుంది. రూ.2 లక్షలకు మించి ట్రాన్సుఫర్ కోసం ఆర్టీజీఎస్ కాగా, రూ.2 లక్షల లోపు నగదు బదలీకి నెఫ్ట్‌ను ఉపయోగిస్తారు. ఇప్పటికే ఇది రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంది. ఆర్టీజీఎస్ కేసులో ప్రతి ట్రాన్సాక్షన్ ఇండివిడ్యువల్‌గా పరిష్కరించబడుతుంది. నెఫ్ట్‌ను సాధారణంగా ఇండివిడ్యువల్స్ ఉపయోగస్తారు.


Click it and Unblock the Notifications