కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (ఏప్రిల్ 8) INR-USD ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&Q) కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించారు. గాంధీనగర్‌లోని GIFT ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు అంతర్జాతీయ ఎక్స్చేంజీలు బీఎస్ఈకి చెందిన ఇండియా ఐఎన్ఎక్స్, ఎన్ఎస్ఈకి చెందిన ఎన్ఎస్ఈ-ఐఎఫ్ఎస్‌సీలపై ప్రారంభించారు. INR-USD ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&Q) ప్రారంభం ఎంతో ఉపయోగకరమైనది. ఎందుకంటే ఇది భారత కరెన్సీ మార్కెట్లో ప్రమాదం, అస్థిరతను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కరెన్సీ కాంట్రాక్ట్ ఏమిటి?
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి సరళంగా చెప్పాలంటే భవిష్యత్తు తేదీలో కొనుగోలు లేదా అమ్మకం ఛాయిస్. ఈ ఏడాది నవంబర్ నాటికి అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి పడిపోతుందని మీరు భావిస్తే మీరు F&O మార్కెట్‌లో డాలర్స్ కొనుగోలు చేయవచ్చు. అలా కాకుండా రూపాయి కంటే డాలర్ తగ్గుతుందని భావిస్తే కనుక నవంబర్ కాంట్రాక్ట్‌తో మీరు డాలర్స్‌ను అమ్మవచ్చు. అయితే మీరు నవంబర్ నాటికే విక్రయించాల్సిన అవసరం లేదు. ముగియబోతున్న జూన్, జూలై తదితర కాంట్రాక్ట్‌లలోను కొనుగోలు చేయవచ్చు. నవంబర్ కేవలం ఉదాహరణ మాత్రమే.

మన వద్ద డాలర్లు లేకుండా ఎలా అమ్ముతాం?
చాలామందికి ఓ ప్రశ్న ఉదయిస్తుంది. మన వద్ద డాలర్లే లేనప్పుడు ఎలా అమ్మగలమని. అదే F&O మార్కెట్ ప్రత్యేకత. మీ వద్ద లేకుండానే విక్రయించవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే మీరు నవంబర్ కాంట్రాక్టులో గనుక డాలర్స్ విక్రయిస్తే ఆ కాంట్రాక్ట్ గడువు ముగిసేలోపు ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు. F&O మార్కెట్లో కొనుగోలు చేసినప్పుడు లాట్‌గా అంటే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు షేర్ మార్కెట్లో 1 లాట్ అంటే 1000 లేదా 500 షేర్లు కొనుగోలు చేయవచ్చు. కరెన్సీ మార్కెట్లో కూడా వెయ్యి డాలర్లుగా కొనవచ్చు లేదా అమ్మవచ్చు. ఆసక్తికర విషయం ఏమంటే మీరు మార్జిన్ మాత్రమే ఉంచాలి.

మార్జిన్ అంటే ఏమిటి?
మీరు విదేశాలకు ప్రయాణిస్తుంటే, మీరు ఫిజికల్‌గా డాలర్లను తీసుకు వెళ్లాలంటే మీరు రూ.75,000 చెల్లించాలి. అంటే ప్రతి డాలర్‌కు రూ.75 చొప్పున 1,000 డాలర్లకు చెల్లిస్తారు. కానీ F&Oలో మీరు 10 శాతం మాత్రమే చెల్లించాలి. కాబట్టి మీకు ఇక్కడ కేవలం రూ.7,500 మాత్రమే అవసరం. F&O మార్కెట్లో ఇది ఓ ప్రయోజనం. ఇక్కడ మీరు పెద్ద మొత్తాలను చిన్న అమౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది రిస్క్ కూడా చాలా ఎక్కువ.

బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో NR-USD F&O కాంట్రాక్ట్స్‌తో ప్రయోజనం
గత దశాబ్దా కాలంలో లేదా ఇండియాకు సంబంధించిన ఆర్థిక సేవల్లో గణనీయమైన మార్కెట్ వాటా ఇతర అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలకు మారింది. వివిధ రకాల వ్యాపారాలను ఇండియా తీసుకు రావడం ఆర్థిక కార్యకలాపాల పరంగాను ఉపాధి పరంగా కూడా లబ్ధి పొందేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. INR-USD ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ (F&Q) కాంట్రాక్ట్స్‌ను ప్రారంభించడం ఈ దిశగా ఓ ముందడుగు. ముఖ్యంగా అస్థిరతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆర్బీఐ డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి నిర్దిష్ట ధరను ఎప్పుడూ లక్ష్యంగా పెట్టుకోలేదు. కానీ ఆస్థిరతను తగ్గించడం కోసం ఎప్పుడూ ప్రయత్నాలు చేసింది.


Click it and Unblock the Notifications