హైదరాబాద్: ఈ రోజు (జూన్ 4, మంగళవారం) నుంచి రైతుబంధు పథకం నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయనుంది. ఈ పెట్టుబడి సాయం కోసం ఇప్పటికే రూ.6,900 కోట్లు విడుదల చేశారు. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున ఇచ్చారు. ఈ ఏడాది నుంచి రూ.5వేలకు పెంచారు. కోటీ 38 లక్షల ఎకరాలకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు చాలకపోతే మరిన్ని విడుదల చేయనున్నారు. రెవెన్యూ శాఖ 54.60 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చింది. మిగతా పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్లు ధరణి పోర్టల్లో డిజిటల్ సంతకం చేశారు. ఈ సంతకాలు పూర్తైన రైతులకు ఈ స్కీం నిధులు వస్తాయి.

విడతలవారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు
రైతుబంధు పథకం కోసం రూ.6,900 కోట్లు విడుదల చేయగా, వీటిని రైతులకు ఒకేరోజు ఇవ్వకుండా విడతల వారీగా ఇవ్వనున్నారు. ఒకేసారి అందరి ఖాతాల్లో జమ చేస్తే బ్యాంకుల నుంచి నగదు తీసుకునేందుకు రద్దీ ఏర్పడుతుంది. దీనిని నివారించేందుకు రోజు చొప్పున కొందరి ఖాతాల్లో నిధులు వేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే చేశారు. ఆయా మండలం నుంచి ఓ గ్రామంలోని కొన్ని ఖాతాల చొప్పున రైతుల ఖాతాల వివరాలు పంపించి వారి అకౌంట్లో జమ చేస్తారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో గత ఏడాది 13 విడతలుగా రైతుల ఖాతాల్లో పడింది.

రైతుల ఖాతాల్లోకి నిధులు ఎలా?
RBIకి చెందిన ఈ-కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికి ఉన్న పట్టా భూమి ప్రకారం పెట్టుబడి సాయం అందుతుంది. పట్టాదారు పాసు పుస్తకం, ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఉన్న వారందరికీ రైతుబంధు సొమ్ము అందిస్తారు. ఈ-కుబేర్ యాప్ ద్వారా రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమకాగానే వారి మొబైల్‌కు సందేశం వస్తుంది. ఈ మెసేజ్ రాగానే రైతులు బ్యాంకుకు వెళ్లి నగదును తీసుకోవచ్చు. పెట్టుబడి సాయం వద్దనుకునే రైతులు ఉంటే 'గివ్ ఇట్ అప్' ఫారాన్ని మండల వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వాలి. పెట్టుబడి సొమ్ము పోగా మిగిలిన అమౌంట్‌ను రైతు సమన్వయ సమితికి అందిస్తారు.

రైతుబంధు రాకుంటే ఏం చేయాలి?
రైతుబంధు ద్వారా ఎవరైనా అర్హులకు డబ్బులు రాని పరిస్థితుల్లో వారు వ్యవసాయ విస్తరణాధికారి లేదా మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలి. ఎవరైనా తమ బ్యాంక్ ఖాతాలను వ్యవసాయ విస్తరణాధికారికి ఇవ్వకుంటే వెంటనే అమలు చేసి, ఈ ప్రయోజనం పొందవచ్చు. గత ఏడాది లక్షలాది మంది రైతులు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకపోవడం వల్ల వారికి సొమ్ము రాలేదు. కాబట్టి బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇవ్వడం కూడా తప్పనిసరి. డబ్బులు రాకుంటే అధికారులను కలవాలి.


Click it and Unblock the Notifications