వెండి ధరలు తగ్గాయని ఇన్వెస్టర్లు భయపడకండి.. మళ్లీ భారీగా పెరగనున్న సిల్వర్ రేటు.. కారణం ఇదే..
Silver Price Outlook: దేశీయ విలువైన లోహాల మార్కెట్లో ఇటీవల నెలకొన్న ధరల దిద్దుబాటు మధ్యకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు చక్కని కొనుగోలు అవకాశంగా మారిందని సంగీత బూచ్రా జైపూర్ సహ వ్యవస్థాపకుడు అభినీత్ బూచ్రా అభిప్రాయపడ్డారు. రాబోయే 12 నెలల్లో వెండి ధరలు ప్రస్తుత స్థాయిల నుండి 20 నుండి 25 శాతం వరకు ఎగబాకే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
స్వల్పకాలికంగా ధరలలో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, విలువైన లోహాల దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం బలంగానే ఉందని.. అందువల్ల పెట్టుబడిదారులకు ధర తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేసే అవకాశమే అని ఆయన స్పష్టం చేశారు. అయితే రాబోయే 15 నుండి 30 రోజులలో అంతర్జాతీయ వడ్డీ రేట్ల గమనం, అమెరికా ఆర్థిక గణాంకాలు వెండి, బంగారం ధరల కదలికలను ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు సుమారు 38 నుండి 39 డాలర్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన తర్వాత తిరిగి కోలుకుంది. తక్కువ ధరల కోసం వేచి చూస్తున్న మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, అలాగే ధరలు మరింత పడిపోతాయని షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్లు తిరిగి కొనుగోలు చేయడం ఈ పునరుద్ధరణకు ప్రధాన కారణమయ్యాయి. దీనికి తోడు అమెరికన్ డాలర్ బలహీనపడటం, ట్రెజరీ ఈల్డ్స్ తగ్గడం వంటి అంశాలు విలువైన లోహాల పట్ల సానుకూల సెంటిమెంట్‌ను పెంచాయి.
గత ఏడాది, గత ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుతం కొనుగోళ్ల పరిమాణం గణనీయంగా పెరిగిందని బూచ్రా తెలిపారు. అయితే గరిష్ఠ స్థాయిలలో కొనుగోలు చేసిన మదుపర్లలో పూర్తి విశ్వాసం నింపేందుకు ధరలు మరికొంత స్థిరపడాల్సిన అవసరం ఉందని.. అప్పటివరకు స్వల్పకాలిక అస్థిరతకు ఆందోళన చెందకుండా దశలవారీగా కొనుగోలు చేస్తూ తమ పెట్టుబడి వ్యయాన్ని సగటు చేసుకోవడం ఉత్తమమని సూచించారు.
ధరలలో వచ్చిన ఈ దిద్దుబాటు ఆభరణాల మార్కెట్‌లో వినియోగదారుల కొనుగోలు ధోరణులనూ మార్చివేసింది. గతంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు కొనుగోలుదారులు తేలికపాటి ఆభరణాలు, తక్కువ బరువు గల డిజైన్ల వైపు మొగ్గు చూపగా.. ఇప్పుడు ధరలు దిగిరావడంతో బరువైన వెండి ఆభరణాలతో పాటు వెండి కడ్డీలు, నాణేలకు కూడా డిమాండ్ మళ్లీ ఊపందుకుందని బూచ్రా వివరించారు.
ప్రస్తుతం కొనుగోలుదారులు తమ మొత్తం ఉద్దేశిత పెట్టుబడిలో సుమారు 25 నుండి 30 శాతం నిధులను ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారని.. భౌతిక డిమాండ్ పుంజుకోవడం, దీర్ఘకాలిక సానుకూల అంశాలు రాబోయే కాలంలో వెండి ధరలకు గట్టి మద్దతుగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
