వెండి మీద రూ. 80 వేల కోట్ల పెట్లుబడి.. గ్లోబల్ నంబర్ వన్ టార్గెట్.. ఈ కంపెనీ స్టాక్స్ మీద కన్నేసి ఉంచండి..
Silver Market Alert: వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (HZL) భారీ విస్తరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. రాబోయే మూడు నుండి ఐదు సంవత్సరాలలో తన జింక్, వెండి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రూ. 80,000 కోట్ల భారీ పెట్టుబడి ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
నవంబర్ 17న వెల్లడించిన ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక కింద, సంస్థ శుద్ధి చేసిన జింక్ ఉత్పత్తి సామర్థ్యం వార్షికంగా 2 మిలియన్ టన్నులకు (2 MTPA), వెండి శుద్ధి సామర్థ్యం వార్షికంగా 1,500 టన్నులకు చేరుకోనుంది. ఈ విస్తరణ పూర్తయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద జింక్, వెండి ఉత్పత్తిదారుగా హిందుస్థాన్ జింక్ అవతరిస్తుందని, ప్రపంచ జింక్ డిమాండ్‌లో సుమారు 15 శాతాన్ని ఒక్కటే తీర్చగలదని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.

ప్రతిపాదిత రూ. 80,000 కోట్ల పెట్టుబడిని గనులు, మిల్లులు, స్మెల్టర్ల విస్తరణకు వినియోగించనున్నారు. దీనివల్ల సమీకృత కార్యకలాపాలన్నింటిలో ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే 500కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధికి ఊతం లభిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
రాజస్థాన్‌లో వేదాంత గ్రూప్ ఇప్పటికే పెట్టిన రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడికి తోడుగా.. ఇటీవల ప్రకటించిన రూ. 1 లక్ష కోట్ల అదనపు పెట్టుబడిలో ఇది ప్రధాన భాగంగా నిలవనుంది. 'HZL 2.0'గా పిలుస్తున్న ఈ వ్యూహం సంస్థ వృద్ధి ప్రస్థానంలో తదుపరి దశ అని.. ఇది ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడంతో పాటు స్థానిక వ్యాపారాలు, ఉపాధికి అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమరేందు ప్రకాష్ తెలిపారు.
ఉత్పత్తి సామర్థ్య విస్తరణకే పరిమితం కాకుండా, రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో 'జింక్ ఇండస్ట్రియల్ పార్క్'ను ఏర్పాటు చేసేందుకు హిందుస్థాన్ జింక్ ప్రణాళికలు సిద్ధం చేసింది. జింక్ ఆధారిత తయారీ, అనుబంధ విలువ గొలుసుల వ్యాపారాలకు ఈ పార్కు కేంద్రంగా నిలవనుంది. ఇందులో పరిశ్రమలకు కంపెనీ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' పరిశోధన-అభివృద్ధి (R&D) సదుపాయాలతో పాటు అనుకూలీకరించిన మిశ్రమలోహాల (Customised Alloys) తయారీకి మద్దతు లభిస్తుంది. పెద్ద తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, వర్ధమాన పారిశ్రామికవేత్తలు కనీసం రూ. 5 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ పారిశ్రామిక పార్కులో తమ యూనిట్లను నెలకొల్పవచ్చని సంస్థ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా జింక్, వెండి మార్కెట్లు సరఫరా కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ విస్తరణ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలిక సదుపాయాలు, ఉక్కు తుప్పు నివారణకు జింక్ కీలకం కాగా, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, సోలార్ సెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీలో వెండి వినియోగం అత్యవసరంగా మారింది. మరోవైపు, పర్యావరణ సుస్థిరతకు పెద్దపీట వేస్తున్న హిందుస్థాన్ జింక్, ప్రస్తుతం తన కార్యకలాపాల్లో 27 శాతంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వాటాను 2027-28 ఆర్థిక సంవత్సరం (FY28) నాటికి ఏకంగా 70 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
