భారతీయ సంస్కృతిలో బంగారంలాగే వెండికి కూడా విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి పవిత్ర పర్వదినాల్లో వెండి నాణేలు, ఆభరణాలు, గృహ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రస్తుతం వెండి మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకం సన్నగిల్లుతున్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం.. గత ఐదేళ్లలో వెండి వస్తువులను కొనుగోలు చేసిన ప్రతి ముగ్గురిలో ఒకరు తాము మోసపోయామని భావిస్తున్నారు. అంటే దాదాపు 31 శాతం మంది వినియోగదారులు తాము కొన్న వెండి స్వచ్ఛత విషయంలో అన్యాయానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెండి ఆభరణాలకు కూడా బంగారం తరహాలోనే హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

వెండికి డిమాండ్ ఏటా 18 నుండి 22 శాతం మేర పెరుగుతుండటం గమనార్హం. 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.1.7 లక్షల నుండి రూ. 1.9 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడం, ఫ్యాషన్ రంగంలో వెండి ఆభరణాలకు ఆదరణ పెరగడం మరియు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా వెండిని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావించడం వంటి కారణాల వల్ల దీని వినియోగం పెరుగుతోంది.
ధరలు, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, కొనుగోలుదారులలో ఆర్థిక నష్టభయం కూడా పెరుగుతోంది. అందుకే సర్వేలో పాల్గొన్న వారిలో 93 శాతం మంది వినియోగదారులు తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానానికి జై కొట్టారు. ఇది వినియోగదారులకు నాణ్యత మరియు స్వచ్ఛతపై పూర్తి భరోసాను ఇస్తుందని వారు నమ్ముతున్నారు.
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రస్తుతం Silver కోసం ఏడు రకాల స్వచ్ఛత గ్రేడ్‌లను (800 నుండి 999 వరకు) నిర్ణయించారు. ఇందులో 958 మరియు 999 గ్రేడ్‌లను కొత్తగా చేర్చారు. ప్రతి హాల్‌మార్క్ చేసిన వెండి వస్తువుపై 'SILVER' అనే పదంతో కూడిన BIS మార్క్, స్వచ్ఛత గ్రేడ్, విశిష్టమైన HUID కోడ్ ఉండటం తప్పనిసరి.
2025 సెప్టెంబర్ తర్వాత తయారైన వస్తువుల వివరాలను వినియోగదారులు BIS కేర్ మొబైల్ యాప్ ద్వారా స్వయంగా ధృవీకరించుకోవచ్చు. ఇది నగల వ్యాపారుల రిజిస్ట్రేషన్ నుండి హాల్‌మార్కింగ్ తేదీ వరకు అన్ని వివరాలను అందిస్తోంది. 2026 నాటికి ఈ వ్యవస్థ 110 జిల్లాలకు పైగా విస్తరించి, సుమారు 300 అసెయింగ్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తోంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. వెండి కొనుగోలుదారుల రక్షణ కోసం పటిష్టమైన నియంత్రణలు అత్యవసరం. కేవలం 2 శాతం మంది మాత్రమే హాల్‌మార్కింగ్ అనవసరమని భావిస్తుండగా, అత్యధిక శాతం మంది అది తమ హక్కుగా గుర్తిస్తున్నారు. పండుగ సీజన్లలో జరిగే భారీ కొనుగోళ్లలో మోసాలకు తావులేకుండా ఉండాలంటే, వినియోగదారులు కూడా అవగాహన పెంచుకోవాలి.
ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల మార్కెట్‌లో పారదర్శకత పెరగడమే కాకుండా, నమ్మకమైన వ్యాపార వాతావరణం ఏర్పడుతుంది. వెండి విలువ లక్షల్లోకి చేరుతున్న ప్రస్తుత తరుణంలో, నాణ్యతా ప్రమాణాలు పాటించడం అనేది అటు పరిశ్రమకు, ఇటు సామాన్య వినియోగదారుడికి ఎంతో అవసరం. ఈ దిశగా జరుగుతున్న మార్పులు 2026లో వెండి మార్కెట్‌ను మరింత బలోపేతం చేస్తాయని ఆశించవచ్చు.


Click it and Unblock the Notifications
