పీఎం సూర్యఘర్ పథకంతో కరెంటును మీరే అమ్ముకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?!
పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే. 2023-24 నుంచి 2026-27 వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి రూ.75,021 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం ఉంది. మరి ఆ విద్యుత్‌ను ఉత్పత్తిదారులమైన సామాన్యులే ఎంత వరకూ అమ్ముకోవచ్చు? ఈ పథకంలో చేరాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
7ఏళ్లలో రుణం తీరిపోతుంది: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా 1 కిలోవాట్‌కు రూ.30వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.60 వేలు, 3 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నవారికి రూ.78వేలు గరిష్ఠ రాయితీని అందిస్తారు. అలాగే, ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తొలి 300 యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పించింది కేంద్రం.

అలాగే, ఉత్పత్తిలో మిగిలిన మిగిలిన 600 యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చు. ఈ అమ్మకం ద్వారా నెలకు రూ.1,265 ఆదాయం వస్తుంది. అందులో రూ.610ని బ్యాంకు రుణవాయిదా కింద జమ చేసుకోవడం ద్వారా ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
దరఖాస్తు ఇలా చేయండి: దరఖాస్తు చేయదలచినవారు ముందుగా పీఎం సూర్యఘర్ (pmsuryaghar.gov.in) పోర్టల్‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే.. రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని, విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఐడీని పోర్టల్‌లో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత.. కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే, 'రూఫ్‌టాప్ సోలార్' కోసం అప్లయ్ చేసుకోవచ్చు.
అలా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. డిస్కమ్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇన్‌స్టలేషన్ పూర్తయిన తర్వాత, మీ ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో నమోదుచేసి, నెట్ మీటర్ కోసం అప్లయ్ చేసుకోవాలి.
ఒక్కసారి నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక డిస్కమ్ అధికారులు తనిఖీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్‌ను అందిస్తారు. ఈ సర్టిఫికేట్‌ను పొందిన తర్వాత మన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేస్తే.. 30 రోజుల్లోగా ఆ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము జమ చేయబడుతుంది.


Click it and Unblock the Notifications