ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే వారి పేరు మీద ఉన్న బైక్ లేదా కారును విక్రయించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. మరణించిన వారసులు వాహన యాజమాన్య హక్కులను తమ పేరిట బదలాయించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాలి. ఆర్టీవోను బట్టి నిబంధనలు కూడా మారుతాయి. చనిపోయిన వ్యక్తి, వారసులు వేర్వేరు ఆర్టీవో పరిధిలకు చెందినవారైతే ఈ వాహన యాజమాన్య హక్కుల బదలీ పెను సవాల్. జాతీయ మోటార్ వాహన చట్టం 1989 సవరణలతో ఈ ఇబ్బందులకు ఇక తెరపడనుంది.

నామినేట్ చేయవచ్చు
వాహన యజమాని ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లో ఒక వ్యక్తిని నామినేట్ చేయవచ్చు. వాహన యజమాని మరణించిన సందర్భంలో నామినీ పేరు మీద యాజమాన్యాన్ని బదలీ చేయవచ్చు. ఉదాహరణకు కారును కొనుగోలు చేసినప్పుడు, అలాగే కొనుగోలు చేసిన తర్వాత యజమాని... నామినీని పేర్కొనవచ్చు. నామినీని ప్రస్తావించినప్పుడు యజమాని గుర్తింపు రుజువును సమర్పించాలి.

ముప్పై రోజుల్లో వెల్లడించాలి
వాహన యజమాని మరణించిన విషయాన్ని నామినీ ముప్పై రోజుల్లోగా రిజిస్ట్రేషన్ అధికారికి వెల్లడించాలి. తద్వారా నామినీ ఆ వాహనాన్ని మూడు నెలల వరకు యజమాని హోదాలో ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ మూడు నెలల్లోగా నామినీ వాహన హక్కులను తన పేరిట బదలాయించుకునేందుకు ఫామ్ 31ను సమర్పించాలి. రుణంపై వాహనాన్ని కొనుగోలు చేసిన పక్షంలో యాజమాన్య హక్కుల బదలీకి ముందే ఆ వాహన రుణ బకాయిని చెల్లించవలసి ఉంటుంది. రుణదాత నిరభ్యంతర పత్రం సమర్పించిన తర్వాత హక్కుల బదలీ ఉంటుంది.

రుణం ఉంటే..
కారు లేదా బైక్ పైన ఏదైనా రుణం ఉంటే కనుక నామినీ ఈ రుణ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. రుణం తీసుకున్న బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ నో-ఆబ్జెక్షన్ లేఖ ఇచ్చిన తర్వాత గానీ ట్రాన్సుఫర్ పూర్తి కాదు. యజమాని మరణం అనంతరం కారు లేదా ఇతర వాహన బదలీ సులభతరం చేయాల్సి ఉంది. ఇది విధానపరమైన ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది.


Click it and Unblock the Notifications