మీ ఖాతా మైనస్‌లోకి వెళ్లిందా? భయపడకండి… ఇక నో ఛాన్స్... బ్యాంకులు మీ డబ్బు తీసుకోలేవు
ఇప్పటి వరకు కొన్ని బ్యాంకులు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు వేస్తున్నాయి. ఖాతాలో ఉన్న డబ్బు కంటే ఎక్కువగా చార్జీలు తీసేసి, ఖాతా మైనస్‌లోకి వెళ్లిపోయేలా బ్యాంకులు చేశాయి. ఆ తర్వాత డబ్బు వేసే వరకు, కస్టమర్లను చెల్లించని వారిలా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులపై ఆర్‌బీఐ (RBI) దృష్టి పెట్టి, తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇంతకీ సమస్య ఏమిటి?
గతంలో చాలా బ్యాంకులు ఒకే విధంగా వ్యవహరించేవి. ఖాతాదారులు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే, రూ. 100 నుంచి రూ. 500 వరకు జరిమానా విధించేవి. ఖాతాలో డబ్బు లేకపోయినా, ఆ జరిమానా చార్జీలను డెబిట్ చేసి ఖాతా మైనస్‌లోకి వేస్తున్నాయి. అలా ఖాతాలో నెగటివ్ బ్యాలెన్స్ చూపిస్తూ, తర్వాత ఖాతాదారు డబ్బు వేయగానే ముందుగా ఆ చార్జీలను తీసేసే విధంగా వ్యవహరించటం జరుగుతుంది.
ఈ విధానం వల్ల, డబ్బు లేనివారిపై మరింత భారం పడుతోంది. తర్వాత డిపాజిట్ చేయగానే, ఆ డబ్బు జరిమానాలకు పోయేది. ఇది చిన్న ఆదాయ వేతనులు, వృద్ధులు, విద్యార్థులపై దారుణ ప్రభావం చూపుతోంది.
ఆర్‌బీఐ ఇదే విషయాన్ని గుర్తించి, ఇలా చెప్పింది. "బ్యాంకులు కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా విధించవచ్చు. కానీ, ఖాతాలో ఉన్న మొత్తాన్ని దాటి డబ్బులు తీసుకోకూడదు. ఖాతా బ్యాలెన్స్ నెగటివ్ చేయరాదు."
ఈ నియమం చాలా స్పష్టంగా చెబుతోంది. ఖాతాలో డబ్బు ఉన్నంత వరకు మాత్రమే జరిమానా కట్ చేయాలి. ఖాతాలో ఏమీ లేకపోతే, జరిమానా విధించకూడదు. ఖాతా మైనస్ (negative) లోకి పోకుండా జాగ్రత్త పడాలి.
ఈ మార్గదర్శకాలు చిన్న వేతనాలు పొందేవారికి, ఉద్యోగం లేని యువతకు, వృద్ధులకు, మరియు విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా కాపాడుతాయి. బ్యాంకులు చార్జీలు కట్ చేసి ఖాతాదారుల డబ్బును తగ్గించే అవకాశాన్ని తగ్గిస్తాయి. ఇది ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అంటే, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ అనే లక్ష్యం వైపు ఇది ఒక మంచి అడుగు అవుతుంది. అందరికీ బ్యాంక్ ఖాతా ఉండేలా, ఉపయోగపడేలా చేస్తుంది.
ఇప్పటి నుంచి మనం ఏమి చేయాలి?
మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా, బ్యాంకు చార్జీలు వసూలు చేసినట్లయితే బ్యాంక్‌కు ఫిర్యాదు చేయండి. సమాధానం రాకపోతే, RBI Complaints Portal (https://cms.rbi.org.in) లో ఫిర్యాదు పెట్టండి.
మీ ఖాతాలో ఉన్నంత మొత్తాని కంటే ఎక్కువగా డెబిట్ అయి ఉంటే, మీకు డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉంది.
ఉదాహరణగా మీ ఖాతాలో రూ. 40 మాత్రమే ఉంది. కనీస బ్యాలెన్స్ జరిమానా రూ. 100. బ్యాంకు రూ 40 లోపలే జరిమానా తీసుకోవాలి లేదా ఎలాంటి చార్జీ లేకుండా ఉండాలి. కానీ చట్టబద్ధంగా బ్యాంకు రూ. 100 జరిమానా వేసి, మీ ఖాతాను - రూ 60 (negative balance) లోకి మార్చలేరు.
ఈ రూల్స్ సాధారణ పొదుపు ఖాతాల (Savings Accounts) మీద వర్తిస్తాయి. జన్ ధన్ ఖాతాలు, ప్రాధమిక పొదుపు ఖాతాలు (BSBDA) వంటి ఖాతాలు కూడా ఇందులో చేరతాయి. బ్యాంక్ జరిమానా వేయాలని భావిస్తే, ఖాతాదారుడికి ముందే సమాచారం ఇవ్వాలి. వాట్సాప్, మెసేజ్, మెయిల్ లేదా యాప్ నోటిఫికేషన్ ద్వారా చెప్పాలి. ఖాతాలో డబ్బు ఉన్నప్పుడే జరిమానా తీసుకోవాలి.
బ్యాంకులు ఈ నియమాలను పాటించకపోతే, ఖాతాదారులు RBI Consumer Grievance Cell లేదా CMS పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చు. బ్యాంకులు మరెన్నిరకాల చార్జీలు వసూలు చేస్తాయి అంటే
మినిమమ్ బ్యాలెన్స్ జరిమానా కంటే ఇంకో ముఖ్యమైన చార్జీలు వసూలు చేస్తాయి.
ATM వాడకం మీద చార్జీలు, చెక్ బౌన్స్ ఫీజు, మేన్టెనెన్స్ ఛార్జీలు ఇలాంటి రకమైన ఫీజుల గురించి ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలి.
మీ ఖాతాను మీరు ఎలా రక్షించుకోవచ్చు?
నెలకు ఒకసారైనా స్టేట్‌మెంట్ చెక్ చేయండి. బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లు గమనించండి. ఏదైనా అనుమానాస్పద డెబిట్ ఉంటే వెంటనే బ్రాంచ్‌కి వెళ్లండి.
ఇకపై మీ ఖాతాలో డబ్బు లేకపోయినా, జరిమానా పేరుతో మైనస్ బ్యాలెన్స్ చూపించడాన్ని RBI అడ్డుకుంది. మీ హక్కులు తెలుసుకొని, అవసరమైనప్పుడు వాటిని వినియోగించుకోండి.


Click it and Unblock the Notifications